English | Telugu
రీమేక్ చేస్తే తప్పేంటి?..
Updated : Aug 7, 2023
మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తుండటంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఎంతో క్రేజ్ ఉన్న వీరు రీమేక్ లను పక్కనపెట్టి, కొత్త కథలు చేస్తే బాక్సాఫీస్ దగ్గర మరెన్నో సంచలనాలు సృష్టించవచ్చనే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. అయితే చిరంజీవి మాత్రం రీమేక్ చేస్తే తప్పేంటి అంటున్నారు.
చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్'. 2015 లో వచ్చిన తమిళ సినిమా 'వేదాళం'కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న(ఆగస్టు 6న) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రీమేక్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"చాలామంది రీమేక్ లు చేస్తారేంటి అని అడుగుతుంటారు. ఒక మంచి కంటెంట్ ఉన్నప్పుడు దానిని ప్రేక్షకులకు అందించడం కోసం మన తెలుగు దర్శకులు గానీ, నటులు గానీ రీమేక్ చేస్తే తప్పేంటి?. ఇప్పుడు ఓటీటీలో అన్ని సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి.. రీమేక్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అనిపించవచ్చు. కానీ వేదాళం సినిమా ఓటీటీలో అందుబాటులో లేదు. అందుకే ఈ సినిమా నచ్చి ధైర్యంగా చేశాను." అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
చిరంజీవి మాటలను బట్టి చూస్తే ఇకముందు కూడా ఇలాగే రీమేక్ లు చేసేలా ఉన్నారు. ఆయన మాటల పట్ల ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 'లూసిఫర్'కి రీమేక్ గా వచ్చిన 'గాడ్ ఫాదర్' హిట్ టాక్ తెచ్చుకొని కూడా, బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలింది. ఇప్పుడు 'భోళా శంకర్' కూడా అలాంటి ఫలితాన్ని అందుకుంటే 'బోల్తా శంకర్' అని ట్రోల్స్ ఎదుర్కొనే ప్రమాదముంది. కొత్త కథలు చేసి ఫ్లాప్ అయినా గౌరవంగా ఉంటుందని, అందుకే ఇకనైనా రీమేక్ ఆలోచనలు పక్కన పెడితే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.