English | Telugu
తెలుగునాట 'జైలర్' రేంజ్ లో 'చంద్రముఖి-2' బిజినెస్!
Updated : Aug 17, 2023
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం 'జైలర్' వారం రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగునాట కూడా ఈ సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా.. వారం రోజుల్లోనే రూ.30 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే తెలుగునాట 'చంద్రముఖి-2'కి కూడా 'జైలర్' స్థాయి బిజినెస్ జరగడం విశేషం.
రజనీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన 'చంద్రముఖి' సినిమా 2005 లో విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగునాట ఈ సినిమా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'చంద్రముఖి-2' వస్తోంది. అయితే ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. పి.వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కానుంది. 'చంద్రముఖి' కి సీక్వెల్ కావడం, తెలుగు రాష్ట్రాల్లో లారెన్స్ కి మంచి మార్కెట్ ఉండటంతో.. 'చంద్రముఖి-2' బిజినెస్ రికార్డు స్థాయిలో రజినీకాంత్ సినిమా రేంజ్ లో జరిగింది. 'చంద్రముఖి-2' తెలుగు రాష్ట్రాల హక్కులను ఆస్ట్రేలియా వెంకట్ రూ.12 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా తెలుగునాట ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.