English | Telugu

చ‌తుర్వేదాల‌పై సూర్యతో సినిమా!

డిఫ‌రెంట్ సినిమాల‌ను ఎంచుకుని అందుకు అనుగుణంగా త‌న లుక్‌ను మార్చుకుంటూ ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌లోనూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న అతి కొద్ది మంది సౌత్ హీరోల్లో సూర్య ఒక‌రు. ఇప్ప‌టికే కంగువా వంటి పీరియాడిక్ మూవీలో ఆయ‌న బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇది కాకుండా ఇప్ప‌టికే ఆయ‌న లైన‌ప్‌లో చాలా సినిమాలున్నాయి. అయితే ఈ లిస్టులో మ‌రో సినిమా కూడా చేర‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాను మ‌న టాలీవుడ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు.

వివ‌రాల్లోకి వెళితే కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా స‌క్సెస్ త‌ర్వాత చందు మొండేటి ద‌ర్శ‌కుడిగా నాగ చైత‌న్య ఓ సినిమా చేస్తున్నారు. అది కూడా గీతా ఆర్ట్స్‌లో. ఇది కాకుండా ఇదే బ్యాన‌ర్‌లో సూర్య‌తోనే ఓ సినిమా చేయ‌టానికి ఈ ద‌ర్శ‌కుడు చాలా రోజుల నుంచి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీని గురించి చందు మొండేటి మాట్లాడుతూ ‘‘సూర్యగారిని కలిసిన ప్రతీసారి ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఆయ‌న ఎప్పుడూ ఎంక‌రేజింగ్‌గా మాట్లాడుతుంటారు. నేను డైరెక్ట్ చేసిన కార్తికేయ 2లోని స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించిన విధానం గురించి డిస్క‌స్ చేస్తుంటారు. అదెంతో సంతోషాన్ని క‌లిగిస్తుంటుంది. ఆయ‌న‌తో మ‌న చ‌తుర్వేదాలు ..(ఋగ్వేదం, య‌జుర్వేదం, సామ‌వేదం, అద‌ర్వ‌ణ వేదం) వాటి గొప్ప‌త‌నంపై ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాను. దానికి సంబంధించిన స్క్రిప్ట్ త‌యారు చేసే ప‌నిలో ఉన్నాను. ప్ర‌స్తుతానికి ఆయ‌న దాదాపు ఏడాదిన్న‌ర నుంచి రెండేళ్ల పాటు బిజీగా ఉన్నారు’’ అని అన్నారు చందు మొండేటి.

చందు మొండేటి ప‌క్కాగా స్క్రిప్ట్ రెడీ చేసి అది సూర్యకు న‌చ్చితే చ‌తుర్వేదాల‌పై ఓ గొప్ప పీరియాడిక్ సినిమా గీతా ఆర్ట్స్‌లో సూర్య హీరోగా రూపొంద‌తుంద‌న‌టంలో సందేహం లేదు.