English | Telugu

యోగి, స‌న్యాసి క‌నిపిస్తే... ట్రోల‌ర్స్‌కి ర‌జినీకాంత్ షాక్‌

సూప‌ర్ స్టార్ అంటే సూప‌ర్ స్టారే అని అంటున్నారు ఆయ‌న అభిమానులు. ఎందుకంటే ర‌జినీకాంత్ మాట‌ల్లో ఓ సెన్సాఫ్ హ్యుమ‌ర్ ఉంటుంది. ఆయ‌న ఏది మాట్లాడినా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడేస్తారు. త‌న‌కు అవ‌గాహ‌న లేక‌పోతే లేద‌ని కూడా ఓపెన్‌గానే అంటారు. ఆయ‌న‌పై రీసెంట్‌గా ట్రోలింగ్ జ‌రిగింది. అందుకు కార‌ణం ఆయ‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ కాళ్ల‌కు న‌మ‌స్కారం చేయ‌ట‌మే. దీనికి సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రాగానే ర‌జినీకాంత్ బీజేపీ పార్టీ స‌పోర్ట‌ర్ అని, త‌న‌కంటే చిన్న‌వాడైన వ్య‌క్తి కాళ్ల‌కు ఎందుకు న‌మ‌స్కారం చేశావ‌ని ... అలా ఇలా అంటూ చాలానే కామెంట్స్ వినిపించాయి. అయితే ఆ సంద‌ర్భంలో ఆయ‌నేమీ మాట్లాడ‌లేదు.

జైల‌ర్ రిలీజ్ త‌ర్వాత హిమాల‌యాల‌కు టూర్ వెళ్లిన ర‌జినీకాంత్ అక్క‌డ నుంచి నార్త్ టూర్‌కి కూడా వెళ్లారు. అక్క‌డ ప‌లువురు ప్ర‌ముఖుల‌ను క‌లుసుకుని మాట్లాడారు. మంగ‌ళ‌వారం ఆయ‌న చెన్నై చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయ‌న‌కు అభిమానులు గ్రాండ్ వెల్‌క‌మ్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంలో ఆయ‌న అక్క‌డున్న మీడియాతో మాట్లాడారు. ప‌నిలో ప‌నిగా యోగి కాళ్ల‌కు న‌మ‌స్కారం చేయ‌టంపై త‌న‌దైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. ‘‘ఓ యోగి, స‌న్యాసి నా కంటే వ‌య‌సులో చిన్న‌వారైన‌ప్ప‌టికీ కాళ్ల‌కు న‌మ‌స్క‌రించటం అనేది నా అల‌వాటు అందుక‌నే అలా చేశాను’’ అన్నారు. దీంతో ఆయ‌న త‌న‌ను ట్రోల్ చేసిన వారికి గ‌ట్టిగానే ఇచ్చిన‌ట్ల‌య్యింది.

ఇక జైల‌ర్ సినిమా విష‌యానికి వ‌స్తే.. ఆగ‌స్ట్ 10న విడుద‌లైన ఈ చిత్రం ఇప్ప‌టికే రూ.500 కోట్ల రూపాయ‌ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించి దూసుకెళ్తోంది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మించింది. వసంత్ రవి, రమ్యకృష్ణ, తమన్నా, వినాయకన్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.