English | Telugu
ధనుష్ సినిమా షూటింగ్‌కి అంతరాయం.... అసలేమైంది?
Updated : Apr 27, 2023
ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. తమిళ్ డైరక్టర్ అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తోంది. జి.వి.ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. పరిశ్రమలోని పలువురు నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం తెన్‌కాసీ జిల్లా పళయ కుట్రాలం సమీపంలోని మత్తళంపారై గ్రామంలో సెట్ వేశారు. పశ్చిమ కనుమల కిందుగా వేసిన గుడి సెట్ అందరినీ మెప్పించింది. అక్కడికి దగ్గర్లోని ఓ ఏరుమీద ఓ వారధిని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్కడే షూటింగ్ చేస్తున్నారు. అక్కడి సెంగుళం కాలువను మట్టి వేసి చాలా వరకు పూడ్చేసినందుకుగానూ, అక్కడి ఏరు మీద వారధి కట్టినందుకుగానూ లోకల్ రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అటవీశాఖ పరిధిలో ఉన్న అలాంటి ప్రదేశాల్లో సినిమాల షూటింగ్ చేయాలంటే పక్కాగా అనుమతులు తీసుకోవాల్సిందే.
కానీ అటవీశాఖ అధికారులు అక్కడ షూటింగ్‌కి అనుమతి ఇవ్వలేదట. దాంతో పాటు ఆ ప్రాంతంలో షూటింగ్‌కి సంబంధించి ఇతర శాఖల్లోనూ ఎలాంటి అనుమతులూ తీసుకోలేదట. ఈ విషయం గురించి అడపాదడపా వార్తలు వస్తూనే ఉన్నా, సినిమా యూనిట్ మాత్రం దీని గురించి పట్టించుకోకుండా చిత్రీకరణ చేసింది. ఈ నేపథ్యంలోనే బాంబులు పేలే సన్నివేశాలను కూడా ఆ ప్రాంతంలో తెరకెక్కించారు. అయితే ఆ శబ్దానికి, పొగకు అటవీ ప్రాంతంలోని జంతువులకు ఇబ్బంది కలుగుతోందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దానికి తోడు బాంబు పేలుడు సన్నివేశాలను యువకులు మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో, స్థానిక కలెక్టర్ షూటింగ్ ఆపాలని ఆదేశించారు. దాంతో చిత్రీకరణ ఆగింది. దీని గురించి కెప్టెన్ మిల్లర్ యూనిట్ మాట్లాడుతూ ``మేం షూటింగ్ చేసిన ప్లేస్ ప్రైవేటు వ్యక్తులది. అయితే, మేం అటవీ ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నామని కొందరు తప్పుగా అర్థం చేసుకుని వైరల్ చేశారు. అందువల్ల షూటింగ్ ఆపాల్సి వచ్చింది. అన్నీ అనుమతులు తీసుకుని మళ్లీ త్వరలోనే మొదలుపెడుతాం`` అని అన్నారు.