English | Telugu
‘నేను.. మీ బ్రహ్మానందం’.. ఆత్మకథతో అందర్నీ పలకరించబోతున్న బ్రహ్మానందం!
Updated : Nov 21, 2023
బ్రహ్మానందం.. ఈ పేరులోనే మహదానందం ఉంది. ఆ పేరు పెట్టాలన్న ఆలోచన ఆయన తల్లిదండ్రులకు ఎందుకు వచ్చిందో గానీ ఆ పేరును సార్థకం చేసుకున్నారు బ్రహ్మానందం. తను స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నవ్వులు.. తను మాట్లాడితే చాలు నవ్వులు.. అసలు ఏమీ మాట్లాడకుండా సైగలు చేసినా నవ్వులే. అలాంటి బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మూడు దశాబ్దాలకుపైగా అందరికీ నవ్వులు పంచిన బ్రహ్మానందం ఇప్పుడు సినిమాలు తనంతట తాను తగ్గించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. తనకెంతో ఇష్టమైన పెయింటింగ్స్ వేసుకుంటూ, తన ఆత్మకథను పుస్తకం రూపంలో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాజేంద్రప్రసాద్ హీరోగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘అహ నా పెళ్ళంట’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన బ్రహ్మానందం ఈ 35 సంవత్సరాల్లో దాదాపు 1250కి పైగా సినిమాల్లో నటించారు. అత్యధిక సినిమాల్లో నటించిన నటుడిగా 2010లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. ఇప్పట్లో ఆ స్థానాన్ని ఎవ్వరూ చేరుకోలేనంత ఎత్తుకు ఎదిగారు బ్రహ్మానందం. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో బ్రహ్మానందాన్ని సత్కరించింది. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు, ఆరు సినీ ‘మా’ అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు.2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదలైన నాటి నుంచి ఏ హాస్యనటుడూ సాధించనంత పేరు, అవార్డులు, రివార్డులు, రికార్డులు బ్రహ్మానందం సొంతం చేసుకున్నాడు. ‘అహ నా పెళ్ళంట’ చిత్రంలోని అరగుండు పాత్రతో ప్రేక్షకులకు పరిచయమైన బ్రహ్మానందం ఆ చిత్రం సాధించిన విజయంతో, ఆ చిత్రంలోని తన పాత్రకు లభించిన ప్రశంసలతో సంవత్సరానికి 35కు తగ్గకుండా సినిమాలు చేస్తూ వచ్చాడు. బ్రహ్మానందాన్ని చూడకుండా తెలుగు ప్రేక్షకులకు ఒక్కరోజు కూడా గడవదు. ఆరోజుల్లో సినిమా థియేటర్లలో అయితే... ఈనాడు బుల్లితెరపై.
బ్రహ్మానందంని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఎంతో మంది హాస్యనటులు వచ్చారు. మన తెలుగువారిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే.. హాస్యాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు, హాస్యనటులు ఎంత మంది వున్నా ఆదరిస్తారు. తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నంత మంది హాస్యనటులు ఇంకెక్కడా లేరంటే అతిశయోక్తి కాదు.
తెరపై తన హాస్యంతో ఎంత నవ్వించినా, ఎంతో మందికి నవ్వులు పంచినా.. ఏదో ఒక రోజు తెరమరుగవ్వక తప్పదు. 35 సంవత్సరాలుగా చూస్తున్న బ్రహ్మానందాన్ని ప్రేక్షకులు ఇక చూడలేమన్నారు, ఆదరణ తగ్గింది, అవకాశాలూ తగ్గాయి. దాంతో స్వచ్ఛందంగా తానే సినిమాలను తగ్గించుకున్నారు బ్రహ్మానందం. ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్స్‌ను వేసుకుంటూ.. తన ఆత్మకథను పుస్తకరూపంలో తెచ్చే పనిలో పడ్డారు. ‘నేను.. మీ బ్రహ్మానందం’ అనే పేరుతో తన ఆత్మకథను తనే రాసుకుంటున్నారు. స్వతహాగా తెలుగు లెక్చరర్ అయిన బ్రహ్మానందం ఆత్మకథను వేరొకరు రాసే అవసరం లేదు. అందుకే తన ఆత్మకథ తానే రచించుకుంటున్నారు. వచ్చేనెల.. అంటే డిసెంబర్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంది. తన జీవితంలోని ఒడిదుడుకులు, సుఖ దు:ఖాలు, అందుకున్న పురస్కారాలు, ప్రశంసలు, తన సినీ జీవితంలోని విశేషాలు... ఇలా అన్నీ ఆ పుస్తకంలో ప్రస్తావించారని తెలుస్తోంది.