English | Telugu
ఈ దసరా బాలయ్యదే.. హ్యాట్రిక్ కొట్టాడు!
Updated : Oct 20, 2023
ఈ దసరాకు మూడు బడా సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన 'భగవంత్ కేసరి', దళపతి విజయ్ నటించిన 'లియో' నిన్న(అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' నేడు(అక్టోబర్ 20న) విడుదలైంది. అయితే ఈ మూడు సినిమాల్లో 'లియో', 'టైగర్ నాగేశ్వరరావు' డివైడ్ టాక్ ని సొంతం చేసుకోగా.. 'భగవంత్ కేసరి' మాత్రం మొదటి షో నుంచే అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడంతో 'భగవంత్ కేసరి'పై ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. యాక్షన్, కామెడీతో పాటు బలమైన ఎమోషన్స్ తో రూపొందిన 'భగవంత్ కేసరి'.. ఆ అంచనాలను అందుకుంది. బాలయ్యని దర్శకుడు అనిల్ రావిపూడి చూపించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉన్నాయి.
'భగవంత్ కేసరి'తో పోలిస్తే 'లియో', 'టైగర్ నాగేశ్వరరావు' ఓ వర్గం ప్రేక్షకులకు పరిమితమయ్యే సినిమాలు. ఈ రెండు సినిమాల కోసం యాక్షన్ ప్రియులు బాగానే ఎదురుచూశారు. కానీ ఇప్పుడు రెండు సినిమాలకు హిట్ టాక్ రాకపోవడంతో వారు కూడా ఆదరించడం అనుమానమే. 'భగవంత్ కేసరి' పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ సినిమాకి హిట్ టాక్ వచ్చి, పోటీగా విడుదలైన రెండు సినిమాలకు డివైడ్ టాక్ రావడం కలిసొచ్చింది. పైగా ఇందులో యూత్, మాస్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులోని భావోద్వేగ సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా ఉన్నాయి. పండగ సీజన్ లో కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమాల వైపు ప్రేక్షకులు మొగ్గు చూపుతారు. ఆ పరంగా ఇప్పుడు 'భగవంత్ కేసరి'నే అందరికీ ఫస్ట్ ఛాయిస్ అవుతుంది. అందుకే షో షోకి వసూళ్లు పెరుగుతున్నాయి. మొదటిరోజే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.20 కోట్ల షేర్ రాబట్టిన 'భగవంత్ కేసరి'.. ఫుల్ రన్ లో 'అఖండ', 'వీరసింహారెడ్డి' స్థాయి వసూళ్లు రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.