English | Telugu
'భగవంత్ కేసరి' కలెక్షన్స్.. నిర్మాతలు ఇలా చెప్పేశారేంటి!
Updated : Nov 6, 2023
'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' ఆయనకు హ్యాట్రిక్ హిట్ ని అందించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా.. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలై భారీ వసూళ్లతో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా ఈ చిత్ర వసూళ్లను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మామూలుగా నిర్మాతలు తమ సినిమా అంత కలెక్ట్ చేసింది, ఇంత కలెక్ట్ చేసింది అంటూ రౌండ్ ఫిగర్ గ్రాస్ లు ప్రకటిస్తుంటారు. కానీ షైన్ స్క్రీన్స్ సంస్థ మాత్రం వరల్డ్ వైడ్ షేర్, గ్రాస్ ను వివరంగా తెలపడంతో పాటు.. ఎప్పుడూ లేని విధంగా మూవీ థియేట్రికల్ బిజినెస్ ని కూడా ప్రకటించింది. మేకర్స్ తెలిపిన వివరాల ప్రకారం, 'భగవంత్ కేసరి' వరల్డ్ వైడ్ గా రూ.57.63 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా.. 18 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.70.01 కోట్ల షేర్(రూ.139.19 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది.
బాలయ్య గత చిత్రాలను పరిశీలిస్తే.. 'అఖండ' రూ.75 కోట్ల షేర్ వసూలు చేయగా, 'వీరసింహారెడ్డి' రూ.79 కోట్ల షేర్ రాబట్టింది. మరి 18 రోజుల్లో రూ.70 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన 'భగవంత్ కేసరి' ఫుల్ రన్ లో ఎంత రాబడుతుందో చూడాలి.