English | Telugu
అప్పుడు 'భీమ్లా నాయక్'.. ఇప్పుడు 'టైసన్ నాయుడు'!
Updated : Jun 12, 2023
'అయ్యారే', 'అప్పట్లో ఒకడుండేవాడు' వంటి సినిమాలతో తన ప్రతిభ చాటుకున్న దర్శకుడు సాగర్ కె చంద్ర మూడో సినిమాకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసి 'భీమ్లా నాయక్' రూపంలో మంచి విజయాన్ని అందుకున్నారు. మలయాళ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో పోలీస్ గా పవన్ ని చూపించిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు సాగర్ డైరెక్ట్ చేస్తున్న నాలుగో సినిమా కూడా పోలీస్ కథే అని, దీనికి కూడా 'భీమ్లా నాయక్' తరహాలో 'టైసన్ నాయుడు' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారని తెలుస్తోంది.
సాగర్ కె చంద్ర తన తదుపరి చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదొక పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ అని తెలుస్తోంది. గతంలో 'కవచం', 'రాక్షసుడు' సినిమాల్లో బెల్లంకొండ పోలీస్ గా కనిపించగా.. అందులో 'రాక్షసుడు' విజయాన్ని సాధించింది. ఈసారి హైవోల్టేజ్ పోలీస్ కథతో వస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాకి 'టైసన్ నాయుడు' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేసినట్లు వినికిడి. ఈ సినిమా బెల్లంకొండకి చాలా కీలకం. గత ఆరేళ్లలో 'రాక్షసుడు' మినహా ఆయన నటించిన సినిమాలేవీ మెప్పించలేకపోయాయి. గత రెండు చిత్రాలు 'అల్లుడు అదుర్స్', 'ఛత్రపతి' హిందీ రీమేక్ ఘోర పరాజయాలను మూటగట్టుకున్నాయి. మరి ఈ 'టైసన్ నాయుడు'తోనైనా బెల్లంకొండ ట్రాక్ లో పడతాడేమో చూడాలి.