English | Telugu
సాహితీ పరిపూర్ణుడు, కళా ప్రపూర్ణుడు ఆరుద్ర
Updated : Jun 4, 2014
కళ కేవలం కళ కోసమే కాదని అభ్యుదయ కవులకు మార్గం చూపిన ఆరుద్ర పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. అభ్యుదయ కవిగా, నాటక కర్తగా, పరిశోధకుడిగా, పండితుడిగా, విమర్శకుడిగా, తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోను రచనలు చేసిన సాహితీమూర్తిగా, ఆయన ఎంతో ప్రసిద్దులు. రజాకార్ తెలంగాణ పోరాట ఇతివృత్తంతో ఆయన 1949లో రాసిన త్వమేవాహం నేటికి తెలుగు సాహిత్యంలో విలువైన కావ్యంగా పరిగణిస్తారు. ఆరుద్ర, శ్రీశ్రీ సమకాలీనులు. ఒకరు యువతపై చెరగని ముద్ర వేస్తే, మరొకరు అభ్యుదయ కవులకు స్ఫూర్తిగా నిలిచారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, శ్రీశ్రీ ఈయనకు స్వయానా మేనమామ.
1925, ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించిన ఆరుద్ర, విజయనగరంలో ఎం.ఆర్ కాలేజీ లో చదువుకున్నారు. తర్వాత స్వాతంత్ర్య సమరం ఉదృతంగా కొనసాగుతున్న కాలంలో, తన పద్దెనిమిదవ ఏట చదువుకు స్వస్తి చెప్పి, అప్పటి ఎయిర్ ఫోర్స్ లో గుమాస్తాగా చేరారు. స్వాతంత్ర్యానంతరం చెన్నైలోని ప్రముఖ వారపత్రిక 'ఆనందవాణి'కి సంపాదకుడిగా పనిచేశారు. ఆ సమయంలో అభ్యుదయ రచయితల సంఘం అభివృద్ధికి ఆరుద్ర ఎంతగానో కృషి చేశారు.
చెన్నై వచ్చిన తొలినాళ్లలో తిండికి లేక నీళ్లు తాగి కడుపు నింపుకుంటున్న రోజుల్లోనూ ఆయన రాయటం ఎప్పుడూ మానలేదు. డిటెక్టివ్ నవలలు, గేయాలు, గేయనాటికలు, పరిశోధక వ్యాసాలు, విమర్శనాత్మక వ్యాసాలు, ఆంధ్ర సాహిత్య సంపుటాలు ఇలా వివిధ ప్రక్రియలు ఆయన వైవిధ్య రచనల్లో భాగమే. ఇలా సాహిత్య అభిమానులకు దగ్గరైన ఆయన సామాన్య ప్రజానీకానికి బాగా పరిచయం అయింది సినీ గీతాల ద్వారా. పరిశోధన, విమర్శకత, సామజిక బాధ్యతతో కూడిన దృక్పథం ఇవన్నీ కవి వ్యక్తీకరణలో భావాలే. అవన్నీ సమగ్రంగా తన రచనలలో చొప్పిస్తూ నవ్య రచనా శైలికి నాంది పలికిన అరుదైన వ్యక్తి ఆయన. ఇంతటి వైవిధ్యం గల కవి ఆధునిక తెలుగు సాహిత్యంలో మరొకరుండరు. 1985లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ - గౌరవ డాక్టరేట్‌ను అందచేసింది.
అభ్యుదయవాదిగా ఎన్నో రచనలు చేసిన ఆరుద్ర, సినిమాలకోసం మరుపురాని ప్రేమగీతాలను కూడా అందించారు. అందులో కొన్ని
బందిపోటు చిత్రంలో " ఊహలు గుసగుసలాడే "
ఇద్దరు మిత్రులు చిత్రంలో - " హలో హలో అమ్మాయి "
ఆత్మ గౌరవం చిత్రంలో " రానని రాలేనని ఊరకె అంటావు. "
ఆత్మీయులు చిత్రంలో " స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు ".
అలాగే బాలరాజు కథ లో " మహాబలిపురం మహాబలిపురం ", ఆంధ్ర కేసరి చిత్రంలో " వేదంలా ప్రవహించే గోదావరి ", యం.ఎల్.ఏ. చిత్రంలో " ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం పాటలు ఆ ప్రాంతం పేరు విన్నప్పుడల్లా మనసులో మెదులుతుంటాయి.
గోరంత దీపం చిత్రంలో " రాయినైనా కాకపోతిని ", ముత్యాల ముగ్గు చిత్రంలో " ముత్యమంత పసుపు ముఖమెంతో చాయ " , అందాల రాముడు చిత్రంలో " ఎదగడానికికెందుకురా తొందర ", బాల భారతం చిత్రంలో " మానవుడే మహనీయుడు " ఆరుద్ర గారు అందించిన అపురూప గీతాలే.
(జూన్ 4 - ఆరుద్ర వర్ధంతి సందర్భంగా)