English | Telugu
రూ.100 కోట్ల సినిమాతో వస్తున్న అనుష్క.. 15 భాషల్లో రిలీజ్!
Updated : Oct 18, 2024
‘సూపర్’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క తెలుగు, తమిళ్‌లో తప్ప మరో భాషలో నటించలేదు. తన సొంత రాష్ట్రం కర్ణాటక. కన్నడలో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. అయితే మొదటిసారి మలయాళంలో ఓ సినిమాకి ఓకే చెప్పింది. ‘కథనార్.. ది వైల్డ్ సోర్సెరర్’ పేరుతో దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంలో జయసూర్య హీరోగా నటించారు. హారర్ ఫాంటసీ థ్రిల్లర్ జోనర్‌లో రోజిన్ థామస్ ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీగోకుల్ మూవీస్ పతాకంపై గోకుల్ గోపాలన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మలయాళంలో హై బడ్జెట్ సినిమాలు చాలా తక్కువగా నిర్మిస్తారు. వాటిలో ‘కథనార్’ ఒకటి. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. 9వ శతాబ్దంలోని క్రైస్తవ మతగురువు కడమత్తత్తు కథనార్ జీవితం ఆధారంగా పి.రామానంద్ ఈ కథను సినిమాకు అనుగుణంగా సిద్ధం చేశారు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిస్తున్న ఈ సినిమా ఆడియన్స్‌కి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ నిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఆడియన్స్ థ్రిల్ అయ్యే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయట. బాహుబలి సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న అనుష్క.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండడంతో సినిమా రేంజ్ మరింత పెరిగింది. అనుష్క కెరీర్‌లో ‘కథనార్’ మరో సూపర్‌హిట్ మూవీ అవుతుందని దర్శకనిర్మాతలు అంటున్నారు.
మొదట ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే షూటింగ్ డిలే కావడం, చాలా రోజులుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండడంతో డిసెంబర్‌లో చిత్రాన్ని రిలీజ్ చెయ్యడం సాధ్యం కాదని, త్వరలోనే రిలీజ్ డేట్‌ని ఎనౌన్స్ చేస్తామని నిర్మాత గోకుల్ గోపాలన్ ప్రకటించారు. ఈ సినిమా వచ్చే సంవత్సరమే రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్‌ని చాలా గ్రాండ్ లెవల్‌లో ప్లాన్ చేస్తున్నారు. మలయాళంతోపాటు ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ, చైనీస్, ఫ్రెంచ్, కొరియన్, ఇటాలియన్, రష్యన్, ఇండోనేషియన్, జపనీస్.. ఇలా మొత్తం 15 భాషల్లో ‘కథనార్’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. మొదటి భాగం విడుదలైన తర్వాత కనీసం ఒక సంవత్సరమైనా గ్యాప్ తీసుకొని రెండో భాగాన్ని విడుదలకు సిద్ధం చేస్తారని సమాచారం.
‘బాహుబలి’ వంటి ఆల్‌టైమ్ హిట్ తర్వాత అనుష్క సినిమాలు బాగా తగ్గించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయిన ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క చేస్తున్న భారీ సినిమా ఇది. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంలో మెరిసిన అనుష్క ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఘాటి’ చిత్రంలో నటిస్తున్నారు. యదార్థ ఘటనల ఆధారంగా క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.