English | Telugu

'బ్రో'కి అక్రమ ఫండింగ్ జరిగిందంటూ.. ఢిల్లీలో ఫిర్యాదు చేయనున్న అంబటి!

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'బ్రో' అక్రమ ఫండింగ్ తో తెరకెక్కిందంటూ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై వైసీపీ ఎంపీలతో కలిసి అంబటి ఈ రోజు రాత్రి ఢిల్లీలో ఫిర్యాదు చేయనున్నారని సమాచారం. ఇందులో భాగంగానే 'బ్రో' చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎన్నారైల నుండి డబ్బులు సేకరించి.. ఆ నగదుని సినిమా పేరుతో పవన్ కళ్యాణ్ కి ఇస్తున్నారని రాంబాబు ఆరోపించారు. ఈ క్రమంలోనే 'బ్రో'కి అక్రమ ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగాయని.. ఈ విషయాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేయనున్నారు.

'బ్రో' సినిమాపై అంబటి రాంబాబు ఇంతలా సీరియస్ గా ఉండడానికి ఓ బలమైన కారణం ఉంది. అదేమిటంటే.. ఈ సంవత్సరం సంక్రాంతి పండగ టైమ్ లో అంబటి రాంబాబు చేసిన నృత్యాన్ని గుర్తుచేసేలా 'బ్రో'లో ఓ సన్నివేశం ఉంది. అది కావాలనే తీశారన్నది అంబటి వెర్షన్. ఎవరిని ఉద్దేశించి తీయలేదంటూనిర్మాతలు క్లారిటీ ఇచ్చినా.. అంబటి మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోనని ప్రకటించారు. ఇందులో భాగంగానే 'బ్రో' చిత్రంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారట. అంతేకాదు.. 'బ్రో' ఓవరాల్ కలెక్షన్స్ రూ. 60 కోట్ల నుంచి రూ. 70 కోట్ల వరకు వస్తాయనుకుంటుంటే.. కథానాయకుడు పవన్ కళ్యాణ్ పారితోషికం రూ. 50 కోట్ల పైనే ఉందని రాంబాబు ఆరోపించారు. ఈ క్రమంలోనే 'బ్రో' కోసం పవన్ రూ. 66 కోట్లు తీసుకున్నారా? లేదంటే రూ. 80 కోట్లు తీసుకున్నారా? అదేవిధంగా.. తను తీసుకున్న నగదుని ఇన్ కం టాక్స్ కి చూపించారా, లేదా? వంటివన్నీ దర్యాప్తులో తేలుతుందన్నారు. ఇక 'బ్రో' అక్రమ ఫండింగ్ వ్యవహారమంతా చంద్రబాబు డైరెక్షన్ లోనే జరుగుతోందని.. సినిమా నిర్మాణాన్ని బ్లాక్ మనీ తరలింపు కోసం వినియోగిస్తున్నారని రాంబాబు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. 'బ్రో' ఆర్థిక లావాదేవీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తో పాటు సిబీఐలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. మరి.. ఈ వ్యవహారం ఏ తీరాలకు చేరుతుందో చూడాలి.