English | Telugu
'ఆదిపురుష్' బిజినెస్.. దీని ముందు 'బాహుబలి' బచ్చా!
Updated : Jun 14, 2023
ప్రభాస్ లీడ్ రోల్ చేసిన 'ఆదిపురుష్' మూవీ ఈ ఏడాది అత్యంత అత్యధిక అంచనాలు ఉన్న చిత్రాల్లో ఒకటనేది ప్రత్యేకంగా చెప్పాలా! జూన్ 16న రిలీజ్‌కు సర్వం సిద్ధమైన ఈ మూవీ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేసింది. ఆఖరికి విశ్లేషకులు సైతం 'ఆదిపురుష్' బ్లాక్‌బస్టర్ అవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరయ్యే కొద్దీ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అనూహ్యమైన రీతిలో ఆఫర్స్ అందుకుంటూ వచ్చారు ప్రొడ్యూసర్స్.
'బాహుబలి' సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ దేశవ్యాప్తంగా ఏ స్థాయికి పెరిగిపోయిందో మనకు తెలుసు. తెలుగునాట అయితే అతనికున్న వీరాభిమానుల సంఖ్యకు లేక్కలేదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రదర్శన హక్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకు తగ్గట్లే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 'ఆదిపురుష్' థియేట్రికల్ రైట్స్‌ను పీపుల్ మీడియా సంస్థ ఫ్యాక్టరీ ఏకంగా జీఎస్టీతో కలుపుకొని రూ. 185 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ విషయంలో బాహుబలి 2 ప్రి రిలీజ్ బిజినెస్‌ను ఆదిపురుష్ పెద్ద మార్జిన్‌తో దాటేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బాహుబలి 2 ప్రి బిజినెస్ వాల్యూ రూ. 122 కోట్లు! ఒక్క నైజాంలోనే రూ. 100 కోట్లను 'ఆదిపురుష్' వసూలు చేస్తుందని పీపుల్ మీడియా తరపున సహ నిర్మాతగా వ్యవహరించే వివేక్ కూచిభొట్ల చెప్పారు. దీన్ని సాధించడం కోసం టికెట్ రేట్లను పెంచుకొనే వెసులుబాటు కలిగించాల్సిందిగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని వారు కోరారు.
అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లు ఇచ్చింది రూ. 120 కోట్లు మాత్రమే! తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సక్సెస్‌ఫుల్ అనిపించుకోవాలన్నా, లాభాలు తెచ్చిన సినిమాగా నిలవాలన్నా రూ. 120 కోట్లకు పైగా షేర్, రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ రావాలి. ఆ ఫీట్‌ను 'ఆదిపురుష్' సాధిస్తుందా, లేదా.. అనేది చూడాల్సి ఉంది.
'ఆదిపురుష్'ను ఎక్కువమంది చూడాలనే లక్ష్యంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలంగాణలోని గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు, అనాథ బాలల కోసం 10 వేల కాంప్లిమెంటరీ టికెట్లను కేటాయించాలని నిర్ణయించింది. ఈ సినిమా చూసేవారిలో వయసు తారతమ్యాలు లాంటివి ఉండకూడదనేది ఆ కంపెనీ ఉద్దేశం. అదే తరహాలో అదనంగా మరో 10 వేలమంది నిరుపేద పిల్లలకు టికెట్స్ సమకూర్చడానికి రాంచరణ్, రణ్‌బీర్ కపూర్ ముందుకు వచ్చారు.
రామాయణ గాథ ఆధారంగా ఓం రౌత్ డైరెక్ట్ చేసిన 'ఆదిపురుష్' మూవీలో శ్రీరామునిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, రావణునిగా సైఫ్ అలీఖాన్ నటించారు. హనుమంతుని పాత్రలో దేవ్‌దత్త నాగే, లక్ష్మణుని పాత్రలో సన్నీ సింగ్‌ను చూడబోతున్నాం. ఇంతదాకా రాముడిని మనం మీసాలు లేకుండానే సినిమాల్లో కానీ, క్యాలెండర్లలో కానీ, ఇతరత్రా కానీ చూశాం. తొలిసారి మీసాల రాముడిని 'ఆదిపురుష్'లో చూడబోతున్నాం. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఉన్న సీతను చూడనుండటం కూడా మనకు ఇదే తొలిసారి. అలాగే మీసాలు లేకుండా గడ్డంతో ఉన్న హనుమంతుడిని కూడా మొదటిసారి తిలకించబోతున్నాం. వాళ్ల లుక్స్, కాస్ట్యూమ్స్ ఎంత వివాదాస్పదమైనా, ఈ సినిమా చూడ్డానికి ప్రేక్షకులు తహతహలాడుతున్నారనేది నిజం. దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌కు ఎగబడుతున్న జనసందోహమే దీనికి నిదర్శనం.