English | Telugu

హ్యాట్రిక్ ఫ్లాప్స్.. డిజాస్టర్ దిశగా 'ఆదిపురుష్'!

'బాహుబలి' తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హ్యాట్రిక్ ఫ్లాప్ చూడబోతున్నాడా అంటే 'ఆదిపురుష్' బాక్సాఫీస్ లెక్కలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. 'బాహుబలి' తర్వాత వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్' బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా మిలిగాయి. ఇప్పుడు 'ఆదిపురుష్' కూడా అదే బాటలో పయనిస్తోంది. బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చేలా ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్ల నష్టాన్ని చూసేలా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.32.84 కోట్ల షేర్, రెండో రోజు రూ.15.04 కోట్ల షేర్, మూడో రోజు రూ.17.07 కోట్ల షేర్ తో సత్తా చాటిన ఆదిపురుష్.. నాలుగో రోజు నుంచి చేతులెత్తేసింది. నాలుగో రోజు రూ.4.81 కోట్ల షేర్, ఐదో రోజు రూ. 2.82 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. ఐదు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.72.58 కోట్ల షేర్(115.30 కోట్ల గ్రాస్) రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా, బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.50 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇంకో 20 కోట్ల షేర్ అయినా రాబడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30 కోట్ల నష్టం తప్పదు.

ఇక ఇప్పటిదాకా కర్ణాటకలో రూ.11.15 కోట్ల షేర్, తమిళనాడులో రూ.2.15 కోట్ల షేర్, కేరళలో 76 లక్షల షేర్ సాధించగా.. హిందీలో అయితే తెలుగు వెర్షన్ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. హిందీ, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.61.90 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో ఇప్పటిదాకా రూ.22.20 కోట్ల షేర్ వచ్చింది. దీంతో ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.170.74 కోట్ల షేర్(343 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

వరల్డ్ వైడ్ గా 240 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఆదిపురుష్.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా కనీసం 70 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.70.11 కోట్ల షేర్, రెండో రోజు రూ.39.39 కోట్ల షేర్, మూడో రోజు రూ.42.10 కోట్ల షేర్ తో జోరు చూపించిన ఆదిపురుష్.. నాలుగో రోజు, ఐదో రోజు మాత్రం రూ.11.85 కోట్ల షేర్, రూ.7.29 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. రోజురోజుకి కలెక్షన్స్ దారుణంగా పడిపోతున్నాయి. రెండో వీకెండ్ ఎంతో కొంత ప్రభావం చూపినా మహా అయితే మరో 30 కోట్ల షేర్ రాబట్టే అవకాశముంది అంటున్నారు. అంటే ఫుల్ రన్ లో ఈ సినిమా ఓవరాల్ గా బయ్యర్లకు 40 కోట్ల దాకా నష్టాలను మిగిల్చే ఛాన్స్ ఉంది.