English | Telugu

'NBK 108'.. ఒక్క పాట కోసం ఐదు కోట్ల ఖర్చు!

'అఖండ', 'వీరసింహారెడ్డి' సినిమాలతో వరుస విజయాలు అందుకొని హ్యాట్రిక్ పై కన్నేసిన నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఒక పాట చిత్రీకరణ కోసం ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు పెడుతుండటం హిట్ టాపిక్ గా మారింది.

'NBK 108'లో గణేషుడి నేపథ్యంలో సాగే పాట కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ, శ్రీలీల పై భారీస్థాయిలో చిత్రీకరిస్తున్న ఈ పాట కోసం ఏకంగా ఐదు కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వ్యయంతో తెరకెక్కుతున్న సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ పాటకు తమన్ సంగీతం అందించగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. సినిమాలో ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మూవీ టీమ్ చెబుతోంది.

ఇంకా టీజర్ కూడా విడుదల కాకుండానే 'NBK 108'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రీకరణ దశలో ఉండగానే శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ కోసం భారీ ఆఫర్లు వస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ఏకంగా రూ.35 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్ కి సైతం అదేస్థాయిలో ఆఫర్స్ వస్తున్నాయట. మరి ఈ చిత్రంతో బాలయ్య హ్యాట్రిక్ అందుకొని విజయ పరంపరను కొనసాగిస్తాడేమో చూద్దాం.