English | Telugu
2014లో డిజాస్టర్ సినిమా ఏది??
Updated : Dec 27, 2014
2015 కి స్వాగతాలు పలికేయడానికి తెలుగు చిత్రసీమ సిద్ధమైపోయింది. తారలు కొత్త యేడాది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా... అని ప్లానింగులు చేసేసుకొంటున్నారు. 2014 కొన్ని తీపి, ఇంకొన్ని చేదు జ్ఞాపకాల్ని మిగిల్చి వెళ్లిపోతోంది. ఎవడు, రేసుగుర్రం, మనం, దృశ్యం, లెజెండ్, పవర్, లౌక్యం లాంటి హిట్స్ తో పాటు భారీ ప్లాపులూ, అట్టర్ ప్లాప్ సినిమాల్నీ చవి చూసింది తెలుగు సినిమా. తెలుగు చిత్రసీమను పూర్తిగా నిరాశలో ముంచిన చిత్రాల జాబితా తీస్తే.. అందులో చాలా సినిమాలే ప్రస్తావించాల్సి వస్తుంది. మరింతకీ 2014లో నిర్మాతల్ని, అభిమానుల్ని భారీగా నిరాశ పరిచిన సినిమా ఏది..?? డిజాస్టర్ ఆఫ్ 2014గా ఏ సినిమాని ఎంపిక చేయొచ్చు..?? ఎవ్వరికీ అక్కర్లేని ఈ అవార్డు ఎవరికి వెళ్తుందో ఒక్కసారి తెలుసుకొందాం రండి..!
చిత్రసీమలో విజయాల శాతం ఎప్పుడూ పదికంటే మించదని అనుభవజ్ఞులు చెప్పే మాట. ఈసారీ అదే నిజమైంది. ఇంచుమించుగా 10 నుంచి 15 శాతం సినిమాలు మాత్రమే బాక్సాఫీసు దగ్గర లాభాల్ని దక్కించుకొన్నాయి. యావరేజ్‌లు కొన్ని ఉన్నా మిగిలిన సినిమాల్లో నిర్మాతల్ని ముంచినవే ఎక్కువ. ఒకట్రెండు రోజుల్లో డెఫ్ షీట్స్‌కి వచ్చేసిన సినిమాలూ ఉన్నాయి. క్షత్రియ, లవ్ యూ బంగారం, పైసా, ఆహా కల్యాణం, లడ్డూబాబు, ఉలవచారు బిరియానీ, ఆటోనగర్ సూర్య, రారా కృష్ణయ్య, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ 2, , రోమియో, బ్రదరాఫ్ బొమ్మాళీ, జోరు, రఫ్, ఎర్రబస్సు, ఈ వర్షం సాక్షిగా ఇవన్నీ ఫ్లాప్ సినిమాల లిస్టులో చేరిపోయాయి. వీటితో పాటు ఇంకెన్నో ఫ్లాప్ సినిమాలున్నా.. ఈ సినిమాలపై ప్రేక్షకులకు ఎన్నో కొన్ని అంచనాలుండేవి. అవన్నీ ఈ సినిమాలు తుస్సుమనిపించాయి. నాని, వరుణ్‌సందేశ్, సందీప్‌కిషన్, అల్లరి నరేష్, శ్రీకాంత్ లకు ఈ యేడాది అస్సలు కలసి రాలేదు. వాళ్ల ఖాతాలో ఒక్క సినిమా కూడా లేదు.
ఎన్టీఆర్, మహేష్ బాబులకూ ఫ్లాపులు ఎదురయ్యాయి. ఎన్టీఆర్ `రభస` నష్టాల బాట పట్టింది. రొటీన్ కథ, కథనంలో దమ్ము లేకపోవడం, తమన్ ఊకదంపుడు సంగీతం కలసి.. రభసని కష్టాల పాలు చేసింది. ఇక మహేష్‌కీ ఈ యేడాది మొండి చేయ్యే ఎదురైంది. సంక్రాంతికి వచ్చిన నేనొక్కడినే అభిమానుల్ని మెప్పించలేకపోయింది. ఇదో ప్రయోగాత్మక చిత్రంగా మిగిలిపోయింది. సాంకేతికం గా ఈ సినిమా బాగుందని, సుకుమార్ కాస్త ముందుకెళ్లి ఆలోచించగలిగాడని విమర్శకులు మెచ్చుకొన్నా ఫలితం లేకపోయింది. ఇక ఆగడు నిర్మాతలకు, పంపిణీదారులకు భారీ నష్టాల్ని మిగిల్చింది. దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా కనీసం సగం డబ్బులు కూడా రాబట్టలేకపోయింది. రభసదీ అదే పరిస్థితి. రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే... రూ.20 కోట్లు కూడా అందుకోలేకపోయింది. ఈ యేడాది చివర్లో వచ్చిన చిన్నదాన నీ కోసం కూడా ఫ్లాపే. అయితే లెక్కలెంతో తెలాల్సివుంది.
ఓ చిన్న సినిమా ఫ్లాప్ అయితే నష్టాలూ చిన్నవిగానే ఉంటాయి. కానీ ఓ పెద్ద సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్రభావం పరిశ్రమపై పడుతుంది. నిర్మాతలు సినిమాలు తీయడానికి భయపడతారు. రొటేషన్ లేక ఎక్కడి డబ్బులు అక్కడ ఆగిపోతాయి. నేనొక్కడినే, రభస, ఆగడు సినిమాల వల్ల ఇదే జరిగింది. రొటేషన్ ఆగిపోయి.. ఆ ప్రభావం పూర్తిగా పరిశ్రమపై పడింది. ఈ మూడు సినిమాల వల్ల నష్టపోయిన వాళ్లెంతమందో..?? అయితే రెండు పెద్ద ఫ్లాపులతో 2014లో డిజాస్టర్ హీరోగా ఎవ్వరికీ అక్కర్లేని గుర్తింపు తెచ్చుకొంది మాత్రం మహేష్ బాబు. నేనొక్కడినే, ఆగడు సినిమాలు ఎన్నో అంచనాల మధ్య విడుదలై... కనీసం అభిమానుల్ని సైతం మెప్పించలేకపోయాయి. నేనొక్కడినే కనీసం విమర్శకులను మెప్పించింది. ఆగడు అయితే మరీ దారుణం. ఈ సినిమా ప్రభావం అటు మహేష్‌పై, ఇటు శ్రీనువైట్లపై దారుణంగా పడింది. శ్రీనువైట్లతో సినిమా చేయడానికి కూడా కొంతమంది జంకారు. దాంతో 2014లో డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది... ఆగడు.