English | Telugu
ఆ నంది అవార్డుల వేడుకతో మాకు సంబంధం లేదు
Updated : Aug 4, 2023
రాష్ట్ర విభజనకు ముందు తెలుగు సినీ పరిశ్రమలో నంది అవార్డులకు ఎంతో విశిష్టత ఉండేది. అయితే కోనేళ్ళుగా తెలంగాణ ప్రభుత్వం గానీ, ఏపీ ప్రభుత్వం గానీ నంది అవార్డులు ఇవ్వడంలేదు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులు ప్రధానం చేయాలనే డిమాండ్ లు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పి. రామకృష్ణ గౌడ్ సెప్టెంబర్ 24న దుబాయ్‌లో నంది అవార్డుల వేడుక నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ వేడుకతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించాయి. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటనను విడుదల చేశాయి.
"తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలపమెంట్ కార్పొరేషన్‌ల వద్ద టీఎఫీసీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీకి మాతృసంస్థ. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల గుర్తించబడిన సంస్థలు. సెప్టెంబర్ 24న దుబాయ్‌లో నిర్వహించబడే టీఎఫ్‌సీసీ నంది అవార్డుల గురించి పైన తెలియచేసిన రెండు ఛాంబర్‌లకు ఎలాంటి సంబంధం లేదు. ఇది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పి. రామకృష్ణ గౌడ్ నిర్వహించే వ్యక్తిగత మరియు ప్రైవేట్ ఈవెంట్. ఇది తెలంగాణ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఛాంబర్ కాదు. నంది అవార్డు అనేది ఆంధ్ర రాష్ట్రానికి పేటెంట్ అయినందున, నంది అనే పేరును ఉపయోగించడం, అవార్డు వేడుక నిర్వహించడాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖండిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల వద్ద టీఎఫ్‌సీసీ నంది అవార్డుల ఈవెంట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని అందరికీ తెలియజేస్తున్నాం" అని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి కె.ఎల్.దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి కె.అనుపమ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.