English | Telugu

పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ‌మృణాల్‌ ఠాకూర్!

"నాలుగు ముక్కలు పోగేసి ఉత్త‌రం రాస్తే కాశ్మీర్ ని మంచుకు వదిలేసి వస్తారా" అంటూ సీతారామంలో రామ్‌ని నిలదీసిన సీతగా తెలుగు ప్రేక్షకులకు కలకాలం గుర్తుండిపోతారు మృణాల్‌ ఠాకూర్. బాలీవుడ్ నటి మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సినిమా సీతారామం‌. ఈ సినిమా గత ఏడాది విడుదలై అత్యద్భుతమైన విజయం సాధించింది. ఈ చిత్రంలో సీతగా నటించిన అమ్మాయి ఎవరు అంటూ ఆరాలు తీశారు మామూలుజనాలు... సినీ జనాలు!

ఈ సినిమా తర్వాత మృణాల్‌ ఠాకూర్ ఇతర భాషల్లో ఏమేమి సినిమాలు చేస్తున్నారని ఆరాలు మొదలయ్యాయి నెట్ ఇంట్లో. తాజాగా సూర్య నటిస్తున్న 42వ సినిమాలో మృణాల్ ఠాకూర్ ని కీలక పాత్రలో తీసుకున్నట్టు సమాచారం. దరువు శివ తెరకెక్కిస్తున్న చిత్రమిది. యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె ఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇప్పటికే బాలీవుడ్ నటి దిశప‌టానిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నారు. మరో కీలక పాత్ర కోసం మృణాల్‌ని నాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. పీరియడ్ డ్రామాగా తెర‌కెక్కే ఈ చిత్రంలో దాదాపు పది వైవిధ్యమైన గెట‌ప్పుల్లో కనిపిస్తారు సూర్య.

ఇప్పుడు పీరియడ్ డ్రామాలో మృణాల్‌, సూర్య మధ్య కీలక సన్నివేశాలని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీలంకలోని మారుమూల ప్రదేశాల్లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించడానికి సిద్ధమవుతున్నారు శివ అండ్ సూర్య. ఇంకా షూటింగ్ కూడా పూర్తికాని ఈ చిత్రం హిందీ శాటిలైట్, థియేటర్, డిజిటల్ రైట్స్ రూపంలో100 కోట్లకు పైగా బిజినెస్ జ‌రుపుకుంటున్న‌ట్టు సమాచారం. నాని హీరోగా తెరకెక్కే 30వ చిత్రంలో కూడా నాయికగా మృణాల్‌ ఠాకూర్ పేరు కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే.