English | Telugu
సమంత చేయాల్సిన 'రెయిన్ బో' రష్మిక చేస్తుందా!
Updated : Apr 3, 2023
స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో అలరించే హీరోయిన్లు అరుదుగా ఉంటారు. ఈ తరంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకున్న హీరోయిన్లు అంటే అనుష్క, సమంత పేర్లు ముందుగా గుర్తుకొస్తాయి. 'అరుంధతి', 'భాగమతి', 'రుద్రమదేవి' వంటి సినిమాలతో అనుష్క ఆకట్టుకోగా.. 'ఓ బేబీ', 'యూ టర్న్', 'యశోద' వంటి సినిమాలతో సమంత అలరించింది. త్వరలోనే ఆమె 'శాకుంతలం' సినిమాతో కూడా అలరించడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అనుష్క, సమంత బాటలో మరో స్టార్ హీరోయిన్ పయనించబోతోంది.
తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకున్న బ్యూటీ రష్మిక మందన్న. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. 'పుష్ప' సినిమాతో తన ఇమేజ్ ని అమాంతం పెంచుకుంది. 'సామి సామి' అంటూ నేషనల్ వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం 'పుష్ప-2', 'యానిమల్' వంటి క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న రష్మిక.. తాజాగా ఓ ఫిమేల్ సెంట్రిక్ ద్విభాషా చిత్రానికి శ్రీకారం చుట్టింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి శాంతరూబన్ దర్శకుడు. ఈ సినిమాకి 'రెయిన్ బో' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. సోమవారం ఉదయం ఈ మూవీని పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు. ఏప్రిల్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
నిజానికి సమంత ప్రధాన పాత్రలో శాంతరూబన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ 2021 లో ఓ సినిమాని ప్రకటించింది. ఇప్పుడదే ప్రాజెక్ట్ లోకి సమంత స్థానంలో రష్మిక వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ తో అనుష్క, సమంత మాదిరిగా రష్మిక కూడా విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.