English | Telugu

'దసరా' దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత!

'దసరా' మూవీ సక్సెస్ అందరికంటే ఎక్కువగా ఆ చిత్రాన్ని నిర్మించిన ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ కి బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ బ్యానర్ లో ఇదే మొదటి హిట్. ఆ బ్యానర్ లో గతంలో 'లయన్', 'పడి పడి లేచే మనసు', 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', 'విరాట పర్వం', 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి సినిమాలు రాగా, అందులో ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని నమోదు చేయలేదు. ఈ క్రమంలో వచ్చిన 'దసరా' మూవీ తొలి విజయాన్ని అందించింది. దీంతో ఆ ఆనందంలో చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి.. దర్శకుడితో పాటు ఇతర చిత్ర బృందానికి ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'దసరా'. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న విడుదలై, ఐదు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఈ విజయోత్సాహంతో నిర్మాత సుధాకర్.. చిత్ర దర్శకుడు శ్రీకాంత్ కి కోటి రూపాయల విలువైన కారుని గిఫ్ట్ గా ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు ఈ మూవీ కోసం పని చేసిన టెక్నీషియన్స్ కి ఒక్కొక్కరికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ ని గిఫ్ట్ గా ఇచ్చారట. మొత్తానికి దసరా టీమ్ అంతా ప్రస్తుతం మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది.