English | Telugu
మూడు నెలలు.. తొమ్మిది హిట్లు!
Updated : Apr 4, 2023
చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఈ 2023 సంవత్సరంలో టాలీవుడ్ బాగానే విజయాలను సాధిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకోగా.. మూడు నెలల్లో తొమ్మిది విజయాలు నమోదయ్యాయి. అంటే సగటున నెలకి మూడు హిట్లు వస్తున్నాయన్నమాట.
2023 జనవరిలో సంక్రాంతి కానుకగా 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలు విడుదల కాగా.. రెండూ ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా 'వాల్తేరు వీరయ్య' రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంది. ఇక అదే సంక్రాంతికి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తమిళ్ మూవీ 'వారిసు' తెలుగులో 'వారసుడు' పేరుతో విడుదల కాగా.. అది కూడా బ్రేక్ ఈవెన్ సాధించింది.
ఫిబ్రవరి 3న విడుదలైన 'రైటర్ పద్మభూషణ్' చిన్న సినిమాగా వచ్చి, మంచి విజయాన్ని నమోదు చేసింది. ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం 'సార్' మూవీ ఫిబ్రవరిలోనే విడుదలై, 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఫిబ్రవరిలోనే విడుదలైన 'వినరో భాగ్యము విష్ణుకథ' కూడా బ్రేక్ సాధించి హిట్ స్టేటస్ దక్కించుకుంది.
ఇక ఈ ఏడాది సర్ ప్రైజ్ హిట్ అంటే 'బలగం' అని చెప్పొచ్చు. పెద్దగా అంచనాల్లేకుండా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలన విజయాన్ని అందుకుంది. మార్చి 22న విడుదలైన 'దాస్ కా ధమ్కీ' కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకొని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక మార్చి 30న విడుదలైన 'దసరా' కూడా హిట్ లిస్టులో చేరిపోయింది. 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ.. ఐదు రోజుల్లోనే 50 కోట్లకు పైగా షేర్ రాబట్టి విజయాన్ని అందుకుంది. ఇలా మూడు నెలల్లో తొమ్మిది హిట్లు నమోదు అయ్యాయి. అందులో వారసుడు మాత్రమే డబ్బింగ్ సినిమా. మరి టాలీవుడ్ ఇదే సక్సెస్ జోష్ ని ఏడాదంతా కంటిన్యూ చేస్తుందేమో చూడాలి.