English | Telugu
ఇదేం రామాయణం.. పౌరాణికాలు రాజమౌళికి వదిలేయండి ప్లీజ్!
Updated : Jun 16, 2023
ప్రస్తుతం ఇండియాలో భారీ పౌరాణిక, చారిత్రక చిత్రాలు రూపొందించగల దర్శకుడు అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు దర్శకధీరుడు రాజమౌళి. నిజానికి ఇప్పటిదాకా రాజమౌళి ఒక్క పౌరాణిక చిత్రం కానీ, చారిత్రక చిత్రం కానీ చేయలేదు. అయినప్పటికీ ప్రేక్షకులకు ఆయన మీద ఉన్న నమ్మకం అలాంటిది. 'బాహుబలి' అనే ఫాంటసీ ఫిల్మ్ తో ఆయన సృష్టించిన సంచలనాలను అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. పాత్రలను మలిచిన తీరు, యుద్ధ సన్నివేశాలు కట్టిపడేశాయి. హీరోయిజంని ఎలివేట్ చేయడంలోనూ, ఎమోషన్స్ ని పండించడంలోనూ రాజమౌళి దిట్ట. చారిత్రక వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల స్ఫూర్తితో కల్పిత కథతో ఆయన రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇందులోనూ యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. క్లైమాక్స్ లో రామ్ పాత్రను ఆయన చూపించిన తీరుకి, అది శ్రీరాముడి రూపం అనుకున్నవాళ్ళు కూడా లేకపోలేదు. రాజమౌళి దర్శకత్వంలో రామాయణ, మహాభారత గాథలు రూపొందితే చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రాజమౌళి సైతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని ఇప్పటికే ప్రకటించారు. దాంతో ప్రేక్షకులు రాజమౌళి దర్శకత్వంలో పౌరాణికాల కోసం మరింతగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా 'ఆదిపురుష్' రాకతో పౌరాణికాలను రాజమౌళికి వదిలేయండనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం 'ఆదిపురుష్'. టి.సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకుడు. సినిమా విడుదలకు ముందే పాత్రల వేషధారణ, వీఎఫ్ఎక్స్ పై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక ఈరోజు ఈ చిత్రం విడుదల కాగా దర్శకుడు ఓం రౌత్ పై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. వివిధ పాత్రల వేషధారణ విచిత్రంగా ఉండటంతో, అసలిది నిజంగా రామాయణమేనా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రావణుడి పాత్ర చిత్రీకరణ, మోడ్రన్ సూపర్ హీరోలా ఉన్న ఆయన గెటప్ పై ట్రోల్స్ వస్తున్నాయి. అసలిది రామాయణంలా లేదని పిల్లల కోసం తీసిన హాలీవుడ్ సూపర్ హీరో ఫిల్మ్ లా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో రామాయణ గాధను తెరకెక్కించే అద్భుతమైన అవకాశమొస్తే.. నాశిరకం వీఎఫ్ఎక్స్, విచిత్ర వేషధారణలతో చెడగొట్టాడంటూ డైరెక్టర్ ఓం రౌత్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెళ్లుతున్నాయి. కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఓం రౌత్ పై విరుచుకుపడుతున్నారు. కొందరైతే "మీ బాలీవుడ్ వాళ్ళకో దండం, పౌరాణికాలు రాజమౌళికి వదిలేసి మీరు వేరే సినిమాలు చేసుకోండి, ఇలాంటి సినిమాలకు రాజమౌళి మాత్రమే న్యాయం చేయగలరు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే రాజమౌళి దర్శకత్వంలో రామాయణ, మహాభారత గాథలు రూపొందితే అవి బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టిస్తాయనడంలో సందేహం లేదు.