English | Telugu
నితిన్ 'ఆర్డినరీ మ్యాన్' కాదు!
Updated : Jul 23, 2023
నితిన్ తన 32 వ సినిమాని వక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రేష్ఠ్ మూవీస్ సమర్పణలో ఆదిత్య మూవీస్ తో కలిసి రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. గతేడాది 'మాచర్ల నియోజకవర్గం'తో పరాజయాన్ని అందుకున్న నితిన్, ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరోవైపు రచయితగా ఎన్నో విజయాలు అందుకున్న వక్కంతం వంశీ 'నా పేరు సూర్య'తో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంతో పరాజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగా అతను నిలబడాలంటే ఈ సినిమా విజయం కీలకం.
తాజాగా 'నితిన్ 32' టైటిల్ ని రివీల్ చేయడంతో పాటు, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకి 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' అనే టైటిల్ ని పెట్టారు. 'ప్రతి సాధారణ మనిషి వెనుక ఒక అసాధారణమైన కథ ఉంటుంది' అంటూ ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో నితిన్ రెండు విభిన్న కోణాల్లో కనిపిస్తున్నాడు. ఒక లుక్ లో గుబురు గడ్డంతో సీరియస్ గా కనిపిస్తుండగా, రెండో లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు పోస్టర్ లో క్లాప్ బోర్డు ఉండటం చూస్తుంటే, ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా ఇది సినిమా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న చిత్రమని అర్థమవుతోంది. అలాగే ఈ సినిమాని డిసెంబర్ 23న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ లో పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి హరీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు.