English | Telugu
36 ఏళ్ల తర్వాత.. ఆ కొరత కూడా తీరింది!
Updated : Oct 24, 2023
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నెక్ట్స్ సినిమాను మణిరత్నం దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో కమల్ హాసన్ సరసన నయనతార నటించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇప్పటి వరకు స్టార్ హీరోలందరితోనూ నయనతార కలిసి నటించింది. అయితే కమల్ హాసన్‌తో మాత్రం ఆమె ఇప్పటి వరకు నటించలేదు. ఆ కోరిక కూడా ఇప్పుడు తీరిపోనుంది. ముందుగా ఈ సినిమాలో త్రిషను హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ ఇప్పుడామె స్థానంలో నయనతార నటించనుండటం కొస మెరుపు.
కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన నాయగన్ సినిమా (తెలుగులో నాయకుడు) 1987లో విడుదలైంది. తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేయలేదు. 36 ఏళ్ల తర్వాత మళ్లీ వీరు సినిమా చేస్తున్నారు. కమల్ హాసన్ నటిస్తోన్న 234వ సినిమా ఇది. నాయగన్‌కు ఇళయరాజా సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విక్రమ్ తర్వాత కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు కమల్, మణిరత్నం కాంబో మూవీ రూపొందనుంది. మరో వైపు హెచ్.వినోద్ దర్శకత్వంలోనూ కమల్ హాసన్ సినిమా చేస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న ఇండియన్ 2 మూవీ వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కానుంది. పాతికేళ్ల ముందు వచ్చిన ఇండియన్ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.