English | Telugu

టాలీవుడ్ లో విషాదం.. నేషనల్ అవార్డు విన్నర్ కన్నుమూత!

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ చిత్ర కారుడు, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ పిట్టంపల్లి సుదర్శన్‌ అలియాస్‌ దాసి సుదర్శన్‌(72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మిర్యాలగూడలోని తన స్వగృహంలో సోమవారం గుండెపోటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సుదర్శన్‌(Dasi Sudarshan).. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించారు. చిత్రకళ, సాహితీరంగంలో విశేష సేవలందించిన సినీ రంగంలోనూ రాణించారు. 1988లో బి. నర్సింగరావు దర్శకత్వంలో వచ్చిన 'దాసి' సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు. ఆ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు సుదర్శన్‌. అప్పటినుంచి దాసి సుదర్శన్‌ గా గుర్తింపు పొందారు. జాతీయ అవార్డుల జ్యూరీలో కూడా ఆయన సభ్యుడిగా సేవలందించారు. రచయితగా, పాత్రికేయుడిగా, ఫొటోగ్రాఫర్ గా, కార్టూనిస్ట్ గానూ సుదర్శన్‌ రాణించారు.