English | Telugu

బాలీవుడ్ పై క‌న్నేసిన మైత్రి!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరి నోటా వినిపిస్తున్న మాట మైత్రి మూవీ మేకర్స్. అతి తక్కువ కాలంలోనే ఈ సంస్థ టాలీవుడ్‌లో పేరు మోసిన నిర్మాణ సంస్థగా అవతారమెత్తింది. గతంలో సురేష్ ప్రొడక్షన్స్. గీతా ఆర్ట్స్,క్రియేటివ్ కమర్షియల్స్, వైజయంతి మూవీస్ వంటి బేన‌ర్ల తరహాలో మైత్రి మూవీ మేకర్స్ సాగిపోతోంది, ఒకే ఏడాది సంక్రాంతి కానుకగా ఏకంగా టాలీవుడ్ లో నువ్వా నేనా అన్నట్టు ఉండే బాలయ్య, చిరంజీవిలతో చిత్రాలు తీసి ఒకేసారి విడుదల చేయడం బహుశా చలనచిత్ర చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. ఆ అసాధ్యాన్ని మైత్రి మూవీ మేకర్ సుసాధ్యం చేసింది. ఇంక వీరు మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రంతో చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం,ఉప్పెన, పుష్పాది రైజ్, స‌ర్కార్ వారి పాట‌, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలను నిర్మించారు.

వీటితోపాటు సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ, చిత్రలహరి,డియర్ కామ్రేడ్ ,నానీస్ గ్యాంగ్ లీడర్, మత్తు వదలరా, అంటే సుందరానికి, హ్యాపీ బర్త్డే , ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి మీడియం రేంజ్ చిన్న బడ్జెట్ చిత్రాలను కూడా రూపొందించారు. కానీ ఈ చిత్రాల‌న్నీ నిరాశ‌ప‌రిచాయి. ఏదో చిత్ర‌ల‌హ‌రి మాత్రం బాగా ఆడింది. ప్ర‌స్తుతం వీరు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అమిగోస్,విజయ్ దేవరకొండ- సమంత జంటగా శివనిర్వాన దర్శకత్వంలో ఖుషి, సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో పుష్పా 2 ది రూల్, పవన్ కళ్యాణ్ -హరిష్ శంకర్ కాంబినేష‌న్‌లో ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ ఆర్సి16 చిత్రాలను ఈ సంస్థ నిర్మిస్తోంది. అంటే ఏకంగా ఆరేడు చిత్రాలు ఈ సంస్థ నుంచి ఇప్పటికే లైన్లో ఉన్నాయి.

వీటితోపాటు ఈ సంస్థ బాలీవుడ్ లో కూడా తమ హవాని కొన‌సాగించ‌డానికి సిద్ద‌ప‌డుతోంది. ఇందులో భాగంగా డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్దార్ధ్ ఆనంద్ కాంబినేషన్లో ఓ మూవీని అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత స‌ల్మాన్ ఖాన్‌తో భారీ పాన్ ఇండియా మూవీని రంగం సిద్ధం చేస్తున్నారు. హ‌రీష్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం తర్వాత హరీష్ శంక‌ర్ ని బాలీవుడ్ కి ప‌రిచ‌యం చేస్తూ ఈ ప్రాజెక్ట్ చేయ‌నున్నారు. అయితే హ‌రీష్ శంక‌ర్‌తో వారు చేస్తోన్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ పూర్తి అయి, దాని ఫ‌లితం బాగా ఉంటేనే ఈ కాంబో సెట్ అవుతుంది. అంటే ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ పై హ‌రీష్-స‌ల్మాన్ ల ప్రాజెక్ట్ ఆధార‌ప‌డి ఉంది. ఇలా మైత్రి వారు బాలీవుడ్ లో కూడా ప్రభాస్, స‌ల్మాన్ ఖాన్ ల భారీ చిత్రాల‌ను టేక్ ఓవ‌ర్ చేయ‌నున్నారు. మరి ఈ చిత్రాలు ఈ చిత్ర నిర్మాణ సంస్థకు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో వేచి చూడాలి.