English | Telugu

ఆ 18 నిమిషాలూ మ‌హేష్ క‌నిపించ‌డా??

టైటిల్స్ అయిపోయి తెర‌పై బొమ్మ ప‌డ‌గానే.. మ‌న‌కు హీరో క‌నిపించాల్సిందే. లేదంటే... మ‌న‌సొప్పుకోదు. అభిమాన క‌థానాయ‌కుడ్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ గుండెలు ఉప్పొంగిపోతాయి. సో.. ద‌ర్శ‌కులు కూడా రెండో సీన్‌లోనో, మూడో సీన్‌లోనో హీరోని ఓ భారీ సెట‌ప్ మ‌ధ్య చూపించేస్తారు. అయితే `శ్రీ‌మంతుడు` మాత్రం ఈ థీరికీ విరుద్ధంగా వెళ్ల‌బోతోంద‌ని టాలీవుడ్ వ‌ర్గాల టాక్‌.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం... `శ్రీ‌మంతుడు`లో తొలి 18 నిమిషాలూ మ‌హేష్ క‌నిపించ‌డ‌ట‌. ఫ్లాష్ బ్యాక్‌లో చిన్న‌ప్ప‌టి ఎపిసోడ్స్ సాగుతాయ‌ట‌. ఆ త‌ర‌వాతే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంద‌ని, మ‌హేష్ ఎంట్రీ ఇస్తాడ‌ని తెలుస్తోంది. క‌థ‌కు సంబంధించినంత వ‌ర‌కూ ఆ ఎపిసోడ్ చాలా కీల‌క‌మ‌ని.. అందుకే మ‌హేష్‌ని చూపించ‌లేక‌పోతున్నార‌ని తెలుస్తోంది. ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో అంత సేపు హీరోని దాచ‌డం సేఫ్ కాదు. ఆడియ‌న్స్ నిరుత్సాహ‌ప‌డితే... సినిమా ఫలితం తారుమారు అవుతుంది. అందుకే ఈ విష‌యంపై చిత్ర‌బృందం మ‌రోసారి దృష్టిపెట్టిన‌ట్టు తెలుస్తోంది.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కుదించి, 10 నిమిషాల‌కు తీసుకొచ్చే ఛాన్సులున్నాయా అనేది ఆలోచిస్తోంద‌ట‌. అలాగైనా తొలి ప‌ది నిమిషాలూ.. ప్రిన్స్ అభిమానుల‌కు క‌నిపించ‌డు. ఆ ప‌దినిమిషాలైనా ద‌ర్శ‌కుడు ఎలా మేనేజ్ చేస్తాడ‌నేదాన్ని బ‌ట్టి, ఫ్యాన్స్ రియాక్ష‌న్ ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌రి కొర‌టాల శివ ఏం చేస్తాడో, ఏంటో..?