English | Telugu
'మగధీర' రీరిలీజ్.. మరోసారి సంచలనం సృష్టిస్తుందా!
Updated : Feb 23, 2023
కొంతకాలంగా టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. 'పోకిరి', 'జల్సా', 'చెన్నకేశవరెడ్డి', 'ఖుషి' వంటి సినిమాలు రీరిలీజ్ లోనూ అదిరిపోయే కలెక్షన్స్ తో సత్తా చాటాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ లోకి దర్శకధీరుడు రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 'మగధీర' చేరనుంది.
రామ్ చరణ్ పుట్టినరోజు(మార్చి 27) కానుకగా 'మగధీర'ను భారీస్థాయిలో రీరిలీజ్ చేస్తున్నారు. రామ్ చరణ్ ని స్టార్ గా నిలబెట్టిన సినిమా 'మగధీర' అని చెప్పొచ్చు. 'చిరుత'(2007)తో తెలుగుతెరకు పరిచయమైన చరణ్ తన రెండో సినిమా 'మగధీర'(2009)ను రాజమౌళి దర్శకత్వంలో చేశాడు. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కథాకథనాలు, యుద్ధ సన్నివేశాలు, పాటలు, సంభాషణలు ఇలా అన్నీ ప్రేక్షకులను కట్టి పడేశాయి. అందుకే ఈ చిత్రం అప్పటిదాకా తెలుగు సినీ చరిత్రలో ఉన్న రికార్డులను తిరగరాసి.. అత్యధిక వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ థియేటర్లలో సందడి చేయబోతున్న ఈ చిత్రం మరోసారి భారీ వసూళ్లతో రీరిలీజ్ సినిమాలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.