English | Telugu

ప్రముఖ గీత రచయిత గురుచరణ్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గీత రచయిత గురుచరణ్ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు. (Guru Charan)

గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. అలనాటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడు గురుచరణ్. ఎం.ఎ. చదివిన ఆయన.. దిగ్గజ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు. రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. అందులో "ముద్దబంతి పువ్వులో మూగబాసలు", "కుంతీకుమారి తన కాలుజారి", "బోయవాని వేటుకు గాయపడిన కోయిలా" లాంటి ఎన్నో సూపర్ హిట్ పాటలున్నాయి. మోహన్‌ బాబుకు ఎంతో ఇష్టమైన పాటల రచయిత గురుచరణ్. మోహన్ బాబు చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్నో పాటలను గురుచరణ్ రచించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై తెలుగునాట సంచలనం సృష్టించిన 'రాజధాని ఫైల్స్' చిత్రంలో కూడా గురుచరణ్ పాటలు రాశారు. ముఖ్యంగా ఆయన రాసిన 'ఏరువాక సాగారో' పాట కట్టిపడేసింది.