English | Telugu

ఇంతకీ ఈమె చెప్పింది ప్ర‌భాస్ సినిమా గురించేనా?

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో పలు చిత్రాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన చిన్న బడ్జెట్లో అతి తక్కువ సమయంలో సినిమాలు తీసే మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.  కానీ ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. చిత్రం టైటిల్ రాజా డీల‌క్స్ అని కూడా క్లారిటీ లేదు. ఇవ్వ‌న్నీ ఇండ‌స్ట్రీలో వారు వీరు మాట్లాడుకుంటున్న మాట‌లే. అంటే కేవ‌లం పుకార్లు అని చెప్ప‌వ‌చ్చు. అస‌లు గుట్టు చప్పుడు కాకుండా ఎలాంటి ప్రకటన లేకుండా ఏమాత్రం లీక్ లు ఇవ్వకుండా అంత ర‌హ‌స్యంగా ఈ చిత్రాన్ని తీయ‌డానికి కార‌ణం ఏమిట‌నేది కూడా అర్దం కాని ప‌రిస్థితి.  ఇంత రహస్యంగా షూటింగ్ జరగవలసిన అవసరం ఏముంది? అనే అనుమానం రాక మానదు. అనేక రకాల పుకార్లు షికార్లు  చేస్తున్నాయి. కానీ  ఈ చిత్రానికి సంబంధించిన ఏ వార్త వచ్చినా అది కేవలం పుకారే గాని అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన లేదు. 

అసలు ఈ సినిమా రూపొందుతున్నట్టు కూడా ప్రకటన రాలేదు అంటే విషయం అర్థమయ్యే ఉంటుంది. తాజాగా ఒక షెడ్యూల్ పూర్తయిందని మరో షెడ్యూల్ కు ఏర్పాటు జరుగుతున్నాయని సమాచారం అందుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. ఇందులో ముగ్గురు హీరోయిన్లు న‌టించ‌నున్నార‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి.  మాళవిక మోహన‌న్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్లు నటిస్తున్నారని సమాచారం. తాజాగా మాళవిక మోహన‌న్ సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఈ సందర్భంగా తెలుగు సినిమా గురించి స్పందించింది. మాళవిక మోహన‌న్ ను ఒక అభిమాని తెలుగు సినిమా ఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్నించగా ఆమె స్పందిస్తూ తెలుగులో ఓ సినిమా చేస్తున్నాను. వర్క్ జరుగుతుంది. తప్పకుండా త్వరలోనే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు ప్రభాస్ సినిమాలో కాకుండా మరే సినిమాలో నటిస్తున్నట్టు వార్త రాలేదు. కనుక తాను తెలుగులో సినిమాలో నటిస్తున్నాను అని చెప్పింది అంటే అది ప్రభాస్ మారుతి సినిమా నే అయ్యుంటుందని చాలామంది భావిస్తున్నారు. ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు.