English | Telugu
జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం!
Updated : May 15, 2024
కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలోనూ, ఏదైనా మంచి కార్యానికి విరాళం ఇవ్వడంలోనూ తెలుగు హీరోలు ఎప్పుడూ ముందుంటారు. అలా సాయానికి ముందుండే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. ఎటువంటి ప్రచారం లేకుండా.. సాయం చేయడం, విరాళం ఇవ్వడం ఆయన శైలి. ఆ తర్వాత ఎప్పటికో ఎన్టీఆర్ చేసిన మంచి పని గురించి అందరికీ తెలుస్తుంది. అలా ఇటీవల ఆయన ఇచ్చిన ఓ భారీ విరాళం.. అభిమానుల ద్వారా వెలుగులోకి వచ్చింది.
తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఇటీవల శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయంతో పాటు ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఎన్టీఆర్ రూ.12.50 లక్షలు (12 లక్షల 50 వేలు) విరాళం ఇచ్చారు. అయితే ఈ విషయం ముందుగా మీడియాకి కూడా తెలియలేదు. ఆలయ ప్రాంగణంలో విరాళ వివరాలు తెలుపుతూ ఓ శిలాఫలకం ఉండగా.. దానిని ఒకరు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఆలయ నిర్మాత దాతగా ఎన్టీఆర్ మరియు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులు పొంగిపోతున్నారు. చేసిన సాయాన్ని ప్రచారం చేసుకోని నైజం మా హీరోది అంటూ మురిసిపోతున్నారు.
కాగా, తన పెళ్లి జరిపించిన పూజారుల్లో ఒకరి ద్వారా జగ్గన్నపేట వీరభద్రస్వామి ఆలయ నిర్మాణం గురించి తెలుసుకున్న ఎన్టీఆర్.. తన వంతుగా ఈ విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం.
సినిమాల విషయానికొస్తే, ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' (Devara) చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న మొదటి సాంగ్ విడుదల కానుంది.