English | Telugu
రజనీ... వన్ అండ్ ఓన్లీ!!
Updated : Dec 12, 2014
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో రజనీకాంత్ ఓ సమ్మోహన శక్తి! రజనీ మాట, స్టైల్, నడక, నటన అన్నీ - ఓ మ్యాజిక్‌లా తోస్తాయి. వెండి తెరని వేదికగా చేసుకొని తన జాదూ చూపిస్తున్న మంత్రగాడు... రజనీకాంత్!!
రజనీ అందగాడు కాదు... కండలు తిరిగిన దేహం కానే కాదు... రంగైతే కాటుక నలుపు! అయినా రజనీ అంటే పడిచస్తారు ఫ్యాన్స్! ఆయన సినిమా వస్తే. పండగలన్నీ కట్టకట్టుకొని వచ్చినట్టే. మరి దాన్నేమంటారు మ్యాజిక్ కాకపోతే...?? రజనీ స్టైల్‌గా అలా నడిచొస్తే చాలు, ''ఈ బాషా ఒక్కసారి చెబితే, వందసార్లు చెప్పినట్టే'' అంటూ ఓ డైలాగ్ పడేస్తే చాలు 'జన్మధన్యం' అంటూ మురిసిపోతారు అభిమానులు. తమిళనాటే కాదు, సౌత్ ఇండియా మొత్తం... ఆ మాటకొస్తే భారతదేశం మొత్తం.. రజనీ లా స్టైల్‌ని నమ్ముకొన్న హీరో లేడు. స్టైల్‌కి రజనీ ఓ శాశ్వత చిరునామా. ఈ విషయంలో ఎవ్వరైనా సరే, రజనీ తరవాతే!!
ఎంజీఆర్, శివాజీగణేశన్‌ల తరవాత క్లాసూ మాసూ అనే తేడా లేకుండా, ఒంటిచేత్తో సినిమాని నడిపించే దమ్ము, సత్తా ఉన్నా కథానాయకుడిగా రజనీకాంత్ అవతరించాడు. ఈ స్టార్ ఇమేజ్ ఒక్క రాత్రితో, ఒక్క సినిమాతో రాలేదు. ప్రతి పాత్రనీ ఒక్కో మెట్టుగా ఉపయోగించుకొన్నాడు.చిన్నదో, పెద్దదో, పాజిటీవో, నెగిటీవో ఏపాత్ర వచ్చినా కాదనకుండా చేశాడు. అయితే అందులో తన స్టైల్ కనిపించేలా జాగ్రత్త పడ్డాడు. రజనీ మేనరిజం జనాల్ని మెస్మరైజ్ చేయడం మొదలెట్టాయి. రజనీ ఎంట్రీ ఇస్తున్నాడంటే ప్రేక్షకులు ఎలర్ట్ అయిపోయేవారు. ఏదో ఓ మ్యాజిక్ చేస్తాడు.. అన్నంతగా ఎదురుచూసేవారు. రజనీ సక్సెస్ సీక్రెట్ ఇదే. డాన్సులు, ఫైట్స్ అందరూ చేస్తారు. అయితే అందులోనూ తన స్టైల్ మిక్స్ చేసి.. తనకంటూ తిరుగులేని ఇమేజ్‌ని తనకు తానే సృష్టించుకొన్నాడు ఈ సూపర్ స్టార్.
రజనీకాంత్ ఇమేజ్‌కి మరింత విశిష్టత, విలక్షణత తీసుకొచ్చింది.. ఆయన క్యారెక్టర్. రీలు లైఫులోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ ఆయన హీరో. సాధారణంగా సినీ జీవితంలో ఉన్నవాళ్లు మేకప్ లేకుండా బయటకు రారు. విగ్గులు, టచప్‌లు, షర్టు మీద షర్టు... ఇలా నానా హంగామా ఉండాల్సిందే. కానీ రజనీ అలా కాదు. బయట సర్వసాధారణంగా కనిపిస్తారు. ''తెరపై చూసిన సూపర్ స్టార్ ఈయనేనా'' అని జనాలు ఆశ్చర్యపోతారు. ''నేను తెరపై మాత్రమే హీరో. బయట ఆ హంగులెందుకు. నేనూ మీలానే సాధారణమైన వ్యక్తిని'' అని చెప్పుకొనే అతి గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పుకోవడానికి ఎన్నో ఎన్నెన్నో ఉదాహరణలు. ఓ సారి ఆయన ఇంటికి ఓ అతిథి వచ్చారు. రజనీ ఇంటి పక్కనే ఆయన ఇల్లు. కాకపోతే సినిమాల గురించి పెద్దగా తెలీదు. ఇద్దరి మధ్యా పిచ్చాపాటి సంభాషణ మొదలైంది..
''ఇప్పుడేం చేస్తున్నారు..'' అని రజనీని అడిగారా వ్యక్తి.
''రోబో..హీరోయిన్ ఎవరో తెలుసా ఐశ్వర్యరాయ్.. '' కాస్త గొప్పగా చెప్పాడు రజనీ.
''మరి హీరో ఎవరు?'' అనుమానంగా అడిగాడు అతిథి.
ఈసారి ఆశ్చర్యపోవడం రజనీ వంతైంది.
''నేనే.. హీరో..'' కాస్త నిదానంగా చెప్పాడు.
''మీరు హీరోనా.. ఐశ్వర్యరాయ్ హీరోయినా? పాపం.. ఐశ్వర్య ఇమేజ్ అంతగా పడిపోయిందా'' అంటూ ఆ వ్యక్తి తెగ బాధపడ్డాడట.
ఈ సంఘటన చెప్పింది ఎవరో కాదు, సాక్ష్యాత్తూ రజనీకాంతే. హంగు, ఆర్భాటాలూ, ప్లాస్టిక్ నవ్వులూ తెలియని వ్యక్తిత్వానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి??
ఈమధ్య లింగా ఆడియో ఫంక్షన్‌కి హైదరాబాద్ వచ్చారు రజనీ!
నన్ను అందంగా చూపించడానికి కెమెరామెన్ ఎంతో కష్టపడ్డారు, ఇద్దరు హీరోయిన్లతో అరవై ఏళ్ల వయసులో డ్యూయెట్లు పాడడం దేవుడు వేసిన శిక్ష.. అంటూ తనపై తానే వ్యంగ్య బాణాలు సంధించుకొన్నారు. ఇంతకంటే రజనీ గురించి ఏం చెప్పగలం??
రజనీకాంత్ - కమల్‌హాసన్.. ఇద్దరూ ఒకే గురువు దగ్గర శిష్యరికం చేసినవాళ్లు. కెరీర్‌లో ఇద్దరికీ పోటీనే. కానీ రజనీ ఏమంటారో తెలుసా..?
''భారతదేశం గర్వించదగ్గ నటుడు కమల్.. ఆయన నట విశ్వరూపం చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. నటన విషయంలో కమల్‌కి ఎవ్వరూ పోటీ ఇవ్వలేరు.. అసలు నేను ఆ జాబితాలోనే ఉండను'' అంటారు. తన పోటీదారుడ్ని ఇలా ఎవ్వరైనా కితాబు ఇవ్వగలరా??
ఏ స్టార్ హీరోకైనా సెట్లో క్యార్ వ్యాన్ ఉంటుంది. తన షాట్ అయిపోగానే హీరోగారు క్యార్ వ్యాన్‌లోకి వెళ్లి రిలాక్స్ అయిపోతారు. కానీ రజనీ అలా కాదు. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పే వరకూ క్యార్ వ్యాన్ వాడరు. లంచ్ బ్రేక్ కూడా... తన టీమ్ తో కలసే చేస్తారు. బ్రేక్ టైమ్‌లో లైట్ బోయ్స్‌ని చుట్టూరా కూర్చోబెట్టుకొని జోకులు వేసుకొంటూ సరదాగా గడిపేస్తారట. ఇంత సింప్లిసిటీ.. ఎంతమందికుంది?? తానెక్కడి నుంచి వచ్చాడో రజనీకి బాగా తెలుసు. పడిన కష్టాలు తెలుసు. తగిలిన దెబ్బలూ తెలుసు. అందుకే ఏ విజయాన్నీ నెత్తిన ఎక్కించుకోలేదు. మళ్లీ మునుపటి జీవితం వచ్చినా స్వీకరించే ధైర్యం రజనీకి ఉంది. ఆయన మాటల్లో, చేతల్లో... ఈ విషయం స్పష్టంగా ధ్వనిస్తుంటుంది. ఇంత సింపుల్ గా ఉండే సూపర్ స్టార్ భారతీయ చలన చిత్రసీమ చూసుండదు. బహుశా రజనీ లాంటి మరో సూపర్ స్టార్ పుట్టే ఛాన్సూ లేకపోవచ్చు. అందుకే రజనీకాంత్ అంటే వన్ అండ్ ఓన్లీ... సూపర్ స్టార్.
(ఈరోజు రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా)