English | Telugu

అర్ధశతాబ్ద నిర్మాతకు శతమానంభవతి



కోట్లు గడించిన వారు ప్రపంచంలో కోట్లమంది వుంటారు.
ఎన్ని కోట్లు సంపాదించినా
ఎంతమందిని సంపాదించుకున్నామనే మనసున్న కోటీశ్వరులు కొందరే వుంటారు.
సినీ నిర్మాతలు ప్రతి పరిశ్రమల్లో ఎందరో వున్నా
పోటీతత్వం, నాయకత్వ పటిమ,
అందరికంటే ముందుండాలనే తపన,
చేసిన ప్రతి పనిలో కృషిని, పట్టుదలను నమ్ముకుని పరిశ్రమకు వచ్చి విజయం సాధించిన వారు, అదీ 170 పైగా సినిమాలు నిర్మించిన వారు మాత్రం ఒక్కరే... ఆయనే రామానాయుడు

పంట పండించినా, సినిమాలు నిర్మించినా అందరి కంటే ఎక్కువ నేనే చేయాలి అనే పోటీతత్వం ఆయనది. చేసే ప్రతి పని అంకితభావంతో నిర్వహించి తగు అనుభవం గడించి మేటి అనిపించుకోవడమే అసలైన చదువు అని నిరూపించిన నిత్య విద్యార్థి. ఎప్పుడూ సినిమాల్లోకి రావాలి అని అనుకోని ఆయన, దేశంలో సినిమాలు నిర్మించే అన్ని భాషల్లోను సినిమాలు తీశారు.13 భాషల్లో చిత్రాలు నిర్మించిన అరుదైన నిర్మాత. ప్రపంచ సినీ చరిత్రలో ఎక్కడా కనిపించని ఈ రికార్డుతో గిన్నిస్ లో స్థానం సంపాదించుకున్నారు.


చిన్నప్పుడు చదువు అబ్బలేదు. అలాగని ఆయనకు ఏ చెడు అలవాడు కూడా అబ్బలేదు. అబ్బిందల్లా అనుభవం, ధైర్యం, ముందడుగు.1936వ సంవత్సరం జూన్ 6న ప్రకాశం జిల్లా కారంచేడు లో ఒక రైతు ఇంటి బిడ్డగా పుట్టాడు. తండ్రి వెంకటేశ్వర్లు. చదువు తప్ప అన్నింట్లో ముందుండే వాడు. దూరం పంపిస్తే చదువుతాడేమోనని ఒంగోలులోని డాక్టరు బి.బి.ఎల్.సూర్యనారాయణ అనే బంధువు ఇంటికి పంపారు. ఎస్ ఎస్ ఎల్ సి చదువు కోసం అక్కడ ఉన్నప్పుడు సూర్యనారాయణ రావు లా డాక్టర్ అవ్వాలనుకున్నారు. చదువుతో కాక వృత్తి గౌరవంతో కూడిన గౌరవ డాక్టరేట్ ఆయన తర్వాత కాలంలో అందుకున్నారు. ఇలా ఆయన కన్న ప్రతి కలా సాకారం చేసుకున్నారు.
కోరుకున్నది కోరుకున్న రీతిలో కంటే మెరుగ్గా ఆయనకు చేరువైంది. రైసుమిల్లు వ్యాపారం నచ్చక మానేశారు.1962లో మద్రాసు చేరి, అక్కడ తనకు ఏర్పడిన సినీ పరిచయాలతో నిర్మాతగా 1963లో తొలి చిత్రం అనురాగం నిర్మించారు. ఆర్థికంగా నష్టాన్ని మిగిల్చింది. ఆయన నిరుత్సాహ పడలేదు. ఆ ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్‌ స్థాపించి, రాముడు - భీముడు చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం ఆర్థిక విజయాన్ని అందుకుంది. నిర్మాతగా తన చిత్రం అఖండ విజయం సాధించడంతో మంచి ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత ఆయన దిగ్విజయంగా 170 చిత్రాలు నిర్మించారు. అర్ధ శతాబ్దం పైగా తెలుగుతో పాటు భారత సినీ పరిశ్రమలన్నిటిలో నిర్మాతగా కొనసాగుతున్నారు.


ఒడిదుడుకులు లేని జీవితం వుండదు. సినిమాలో అయితే ఎప్పుడూ ఎవరి జీవితాలు తారుమారు అవుతాయో తెలియదు. ప్రేమనగర్ చిత్రం నిర్మించే నాటికి ఆయన ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఆ సినిమా ఆడక పోతే ఆయన సినీ సన్యాసం చేసి, వ్యవసాయం చేయాలనుకునే స్థాయికి వెళ్లిపోయారు. కానీ అభిరుచి, అవగాహన, ఆయనకు కథల పట్ల వున్న జడ్జిమెంట్ సరైందని ప్రేమనగర్ చిత్ర విజయం నిరూపించింది.


సినిమా ఒక కళ, ఒక వ్యాపారం. కథ ఎంచుకునేటప్పుడు, నిర్మించేటప్పుడు కళాభిరుచి ఎంత అవసరమో, దాన్ని విజయపథంలో నడిపించడానికి అంత వ్యాపార చతురత కూడా కావాలి.. ఆ రెండు సమపాలల్లో ఉన్న వారే డి.రామానాయుడు. అంతే కాదు తాను సంపాందించిన వాటిలో దానాలు, విరాళాలు అందించడంలోను ఆయన ఎప్పుడూ ముందే వుంటారు. అది కాలీజీ రోజులనుంచే ఆయనకున్న లక్షణం. మెదక్ జిల్లా నర్సాపూర్ లో వృద్ధాశ్రమం, అనాథ శరణాలయానికి అయిదెకరాలు, అప్పట్లో జన్మభూమి కార్యక్రమానిక లక్షల్లో విరాళం, రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ పేరిట నేటికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తునే వున్నారు. వ్యక్తిగా ఆయన ఉదారతకు సంబంధించిన ఎన్నో విషయాలు పరిశ్రమలో కథలుకథలుగా చెబుతుంటారు.
విజయానికి రహస్యం ఏమిటని తెలియాలంటే, తెరిచిన పుస్తకంలా కనిపించే రామానాయుడి జీవితం గురించి తెలుసుకుంటే సరి. ఆయన సినీ ఔత్సాహికులకే కాదు, మిగతా వారికి కూడా స్ఫూర్తిదాయకులే... ఈ అర్ధశతాబ్ద నిర్మాత నిండు నూరేళ్లు పూర్తిచేసుకోవాలని కోరుకుందాం...
ఆయన 79వ పుట్టినరోజు సందర్భంగా, శుభాకాంక్షలు అందజేస్తోంది తెలుగువన్...


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.