English | Telugu
‘హడ్డి’ మూవీ రివ్యూ
Updated : Sep 9, 2023
మూవీ : హడ్డి
నటీనటులు: నవాజుద్దీన్ సిద్దిఖీ, అనురాగ్ కశ్యప్, మహ్మద్ జీషన్ అయూబ్, ఇళా అరుణ్, సౌరబ్ సచ్ దేవ్ తదితరులు
రచన: అక్షత్ అజయ్ శర్మ, అదమ్య భళ్లా
సినిమాటోగ్రఫీ: పీయూష్ జయ్ ఓఝూ
ఎడిటింగ్: తాన్యా ఛట్రియా
మ్యూజిక్: రోహన్ ద్వయం
నిర్మాతలు: రాధికా నంద, సంజయ్ సాహా, జీ స్టూడియోస్
దర్శకత్వం: అక్షత్ అజయ్ శర్మ
ఓటిటి: జీ 5.
ప్రైమ్ వీడియోలో రెండు నెలల క్రితం 'టికు వెడ్స్ షేరు' తో అలరించిన నవాజుద్దీన్ సిద్దిఖీ. ఇప్పుడు మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇతను విభిన్న పాత్రలో నటించిన మూవీ 'హడ్డి'. తాజాగా ఇది జీ5 ఓటిటిలో రిలీజైంది. మరి ఈ మూవీతో నవాజుద్దీన్ సిద్దిఖీ మెప్పించాడా లేదా? ఆ కథేంటో ఒకసారి చూసేద్దాం...
కథ:
హడ్డి(నవాజుద్దీన్ సిద్దిఖీ) కి మహిళగా మారాలనే కోరిక ఉండటంతో ఆపరేషన్ చేపించుకొని హారికగా మారతాడు. అయితే అప్పటికే ఆ ప్రాంతంలో ఎంతో మంది ట్రాన్స్ జెండర్ కావాలనుకున్న వాళ్ళని చేరదీసి వారి బాబోగులు చూసుకుంటుంది రేవతి(ఇళా అరుణ్). అయితే రేవతితో హారిక కలిసి ఉంటుంది. అయితే ఇర్ఫాన్(మహ్మద్ జీషన్) అనే వ్యక్తిని ప్రేమిస్తుంది హారిక. అయితే తనని పెళ్లి చేసుకుంటానని హారికతో ఇర్ఫాన్ చెప్తాడు. ఆలోచించుకొని చెప్పమని హారిక అతడికి చెప్తుంది. అయితే అదే ప్రాంతంలోని ఒక రాజకీయ నాయకుడు ప్రమోద్ అహ్లావత్(అనురాగ్ కశ్యప్), రేవతిని హత్య చేస్తాడు. రేవతి ని హత్య చేసింది ప్రమోద్ అహ్లావత్ అని తెలుసుకున్న హారిక.. ఏం చేసింది? రేవతికి ప్రమోద్ కి మధ్య ఉన్న గొడవేంటో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
తాజాగా ట్రాన్స్ జెండర్ పాత్ర చుట్టూ తిరిగే ' తాలీ' వెబ్ సిరీస్ ని మనం చూశాం. అయితే అందులో ఒక అబ్బాయి ట్రాన్స్ జెండర్ గా మారితే ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? బయట సమాజం ఎలా చేస్తుందంటూ చూపించారు. అయితే ఇప్పుడు అదే తరహాలో హడ్డి( నవాజుద్దీన్ సిద్దిఖీ) పాత్రను మలిచాడు డైరెక్టర్ అక్షత్ అజయ్ శర్మ. అయితే స్క్రీన్ ప్లే ప్రథమార్ధం కొన్నసీన్లు బాగున్నాయి. ద్వితీయార్థంలో హడ్డీ, ఇర్ఫాన్ ల మధ్య సాగే కొన్ని సీన్స్ బాగున్నాయి. అయితే ఈ ట్రాక్ అంతా కాస్త స్లోగా సాగుతుంది.
ప్రథమార్ధంలో హారికగా హడ్డి మారడంతో ఇంట్రస్ట్ గా మొదలవుతుంది. కథని ఎత్తుకున్న తీరు బాగుంది. కానీ ఆ తర్వాత స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగుతుంది. పెద్దగా ట్విస్ట్ లు ఏం ఉండవు. సాదాసీధాగా సాగుతుంది. అయితే ఈ మూవీకి బిజిఎమ్ ప్లస్ అయింది. ద్వితీయార్థంలో హడ్డి ఎంతగానో ఇష్టపడే రేవతిని చంపడంతో కథలో వేగం పెరుగుతుంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారంటూ హారిక రివేంజ్ ప్లాన్ చేసే తీరు ఆకట్టుకుంది. అయితే అడల్డ్ సీన్స్ ఉన్నాయి. కాస్త డైలాగ్స్ కూడా సెన్సార్ లేకుండా అలాగే ఉంచేశారు. బహుశా సెన్సార్ వాళ్ళు పట్టించుకోరనేమో ఇష్టానుసారంగా వల్గర్ గా డైలాగ్స్ రాసేశారు. అయితే హారికగా నవాజుద్దీన్ సిద్దిఖీ క్లైమాక్స్ లో ఏడ్పిస్తాడు. ఒకసారి ఈ పాత్రకి కనెక్ట్ అయితే కచ్చితంగా ప్రేక్షకుడు ఏడ్చేస్తాడు. ఎందుకంటే ఆ పాత్రలో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ అక్షత్ అజయ్ శర్మ.
ఇర్ఫన్, హడ్డీల మధ్య ప్రేమ చాలా మెచురిటీతో చూపించి ప్రేక్షకుడు కన్విన్స్ అయ్యేలా చేశాడు డైరెక్టర్. విలన్ రోల్ చేసిన అనురాగ్ కశ్యప్ యొక్క ప్రమోద్ పాత్రని హారిక(నవాజుద్దీన్ సిద్దిఖీ) కి పోటీ ఇచ్చేంతంగా గొప్పగా మలిచాడు డైరెక్టర్. అయితే హడ్డీ గతాన్ని చూపించలేదు. బ్యాక్ గ్రౌండ్ ని చూపించి ఉంటే ఇంకా ఇంపాక్ట్ ఉండేదేమో. కానీ దాని మీద అంత ఆసక్తిని చూపించలేదు మేకర్స్. ప్రథమార్ధంలో కాస్త సాగదీత, కాస్త డ్రామా, ద్వితీయార్థంలో సస్పెన్స్, మర్డర్ రివేంజ్ డ్రామాతో అలా సాగుతుంటుంది ఈ కథ(హడ్డి). అయితే క్లైమాక్స్ ప్రతీ ప్రేక్షకుడికి నచ్చేస్తుంది. అయితే ఈ సినిమా నిడివి కాస్త ఇబ్బందికి గురిచేస్తుంది. తాన్యా ఎడిటింగ్ లో కొన్ని అనవసర సీన్లని, స్లో సీన్లని కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. రోహన్ ద్వయం మ్యూజిక్ పర్వాలేదు. పీయూష్ జయ్ ఓఝూ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
హడ్డి, హారిక పాత్రలలో నవాజుద్దీన్ సిద్దిఖీ నటన ప్రేక్షకులకు నచ్చేస్తుంది. ఆ రెండు పాత్రల్లో అతను ఒదిగిపోయాడు. ప్రమోద్ అహ్లావత్ పాత్రలో అనురాగ్ కశ్యప్ ఆకట్టున్నాడు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
తెలుగు వన్ పర్ స్పెక్టివ్:
బోల్డ్ సీన్స్ ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూస్తేనే బాగుంటుంది. అయితే రివేంజ్ డ్రామాని ఇష్టపడేవారికి ఇది నచ్చేస్తుంది. కాకపోతే కాస్త ఓపికగా చూడాలి.
రేటింగ్: 2.25 / 5
✍🏻. దాసరి మల్లేశ్