English | Telugu

సీఎం భరత్ గా మహేష్ అలరించి నేటికి ఐదేళ్లు!

'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'భరత్ అనే నేను'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా 2018 ఏప్రిల్ 20 న విడుదలై.. మహేష్-కొరటాల కాంబినేషన్ కి రెండో విజయాన్ని అందించింది. ఈ చిత్రం విడుదలై నేటితో ఐదేళ్లు పూర్తయింది.

తండ్రి మరణంతో అనుకోకుండా ముఖ్యమంత్రి అయిన భరత్‌ అనే యువకుడి కథతో ఈ చిత్రం రూపొందింది. చిన్నప్పటి నుంచి విదేశాల్లో ఉండి చదువుకొని, ఇక్కడి రాజకీయ వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన లేని భరత్.. ఎలాంటి మార్పుకి శ్రీకారం చుట్టాడనే అంశాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు. ఇందులో రాజకీయ నాయకులతో పాటు మీడియా, సామాన్యుల తప్పులను కూడా ఎత్తిచూపుతూ ఆలోచనలు రేకెత్తేలా చేశారు. "ఒక్కసారి మాట ఇస్తే.. ఎంత కష్టమొచ్చినా ఆ మాట తప్పకూడదు" అనే పాయింట్ ని ఇందులో చూపించారు. ఈ సినిమాలో మహేష్ బాబు స్క్రీన్ ప్రజెన్స్, ముఖ్యమంత్రిగా ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, దేవరాజ్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. 'వచ్చాడయ్యో సామి', 'భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను' వంటి పాటలు విశేష ఆదరణ పొందాయి.