English | Telugu
Dum Masala : 'దమ్ మసాలా' సాంగ్.. 'గుంటూరు కారం' ఘాటు చూపించింది!
Updated : Nov 7, 2023
'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2014 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'దమ్ మసాలా' అంటూ సాగే ఈ పాట ఇప్పటికే కొంతభాగం లీక్ కాగా, తాజాగా మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.
త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు(నవంబర్ 7) సాయంత్రం 04:05 గంటలకు 'దమ్ మసాలా' పాట విడుదల చేయబడింది. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సంజిత్ హెగ్డే, జ్యోతి నూరన్ ఆలపించారు. థమన్ అందించిన ట్యూన్, బీట్ సరికొత్తగా ఉన్నాయి. పాటలోని సాహిత్యం కథానాయకుడి పాత్ర తీరుని తెలుపుతోంది. "నా తలరాతే రంగుల రంగోలి. దిగులైనా చేస్తా దీవాలి. నా నవ్వుల కోటని నేనే ఎందుకు పడగొట్టాలి", "నేనో నిశబ్దం, అనునిత్యం నాతో నాకే యుద్ధం" వంటి పంక్తులతో గీత రచయిత పాత్రలోని లోతును ఆవిష్కరించారు.
గుంటూరు కారంలో జగపతి బాబు, జయరామ్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్న ఈ చిత్రానికి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు.