English | Telugu
ఓటీటీ సంస్థల కొత్త రూల్.. ఇరకాటంలో నిర్మాతలు!
Updated : Nov 7, 2023
లాక్‌డౌన్‌కు ముందు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై సాధారణ ప్రేక్షకులకు సరైన అవగాహన లేదు. లాక్‌డౌన్ సమయంలో అందరూ ఇళ్ళకే పరిమితమై ఉండడం వల్ల థియేటర్స్‌కి వెళ్ళే అవకాశం లేక ప్రత్యామ్నాయం ఏమిటి ఆలోచిస్తే అప్పుడు ఓటీటీయే శరణ్యమని భావించారు అందరూ. దాంతో ఓటీటీ సంస్థలకు రెక్కలొచ్చాయి. లక్షల్లో సబ్‌స్క్రైబర్స్ చేరిపోయారు. ఇప్పుడు దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రేక్షకులు ఎక్కువ శాతం ఓటీటీలోనే తమ ఆనందాన్ని వెతుక్కుంటున్నారు తప్ప థియేటర్లకు వెళ్ళి సినిమాల చూడాలన్న ఆలోచన చేయడం లేదు. లాక్‌డౌన్‌లో ఓటీటీలకు అలవాటు పడ్డ జనం అందులో సినిమాలు చూసేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు. పైగా థియేటర్స్‌లో రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఓటీటీల్లోకి సినిమాలు వచ్చేస్తుండడంతో కాస్త ఓపిక పడితే ఇంట్లోనే కూర్చొని హాయిగా సినిమాలు చూసెయ్యొచ్చు అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు సామాన్య ప్రేక్షకులు. ఓటీటీకి పెరిగిన ఆదరణను గుర్తించిన కొందరు మేకర్స్ నేరుగా ఓటీటీల్లోనే తమ సినిమాలను రిలీజ్ చేసేస్తున్నారు. కొంతమంది బడా నిర్మాతలు కూడా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కొన్ని సినిమాలను పెద్ద మొత్తం ఇచ్చి కొనుగోలు చేస్తున్నాయి. కొనుగోలు చేసిన సినిమాలను వివిధ భాషల్లోకి డబ్ చేసి స్ట్రీమ్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఓటీటీ సంస్థలు కొత్తగా ఒక రూల్‌ను తీసుకురాబోతున్నాయని తెలుస్తోంది. దీనివల్ల నిర్మాతలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. సంక్రాంతి టైమ్‌లో సినిమాలకు సంబంధించి ఈ కొత్త నిర్ణయం మరింత కఠినంగా మారే అవకాశం ఉందట. సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు సూపర్‌హిట్ అయితే నాలుగు వారాల్లోనే ఓటీటీలో వచ్చేలా, ఒకవేళ ఫ్లాప్ అయితే రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేలా కొత్త రూల్ పెట్టారట. ఈ కొత్త రూల్‌కి నిర్మాతలు ఓకే చెబితేనే డిజిటల్ రైట్స్ తీసుకునేందుకు ఓటీటీ సంస్థలు ముందుకొస్తున్నాయట. నిర్మాతలు కూడా ఓటీటీ సంస్థలు పెట్టిన కొత్త రూల్‌కి ఓకే చెబుతున్నారని సమాచారం. ఇది నిర్మాతలకు ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ మరో మార్గం లేకపోవడంతో ఓటీటీ కండీషన్స్‌కు తలొగ్గక తప్పడం లేదు. థియేటర్స్‌లో సినిమా రిలీజ్ అయిన 8 వారాలకు గానీ ఓటీటీలో ప్రసారం చెయ్యడానికి వీల్లేదని నిర్మాతలు అప్పట్లో డిమాండ్ చేశారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఓటీటీ చేతుల్లోనే సినిమా భవిష్యత్తు ఉంది అనే స్థాయికి ఆయా సంస్థలు ఎదిగాయి. అందుకే ఇప్పుడీ కొత్త రూల్ పెట్టారని తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. సినిమా రిలీజ్‌కి ముందే డిజిటల్ అగ్రిమెంట్ జరిగినా.. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే అగ్రిమెంట్‌లో అనుకున్న మొత్తంలో 30 నుంచి 40 శాతం డబ్బు కట్ చేసి ఇస్తున్నారని సమాచారం.