English | Telugu
లేడీ సూపర్‌స్టార్ గురించి మాళవిక కాంట్రవర్శీ స్టేట్‌మెంట్!
Updated : Feb 13, 2023
ఇద్దరి మధ్య సఖ్యతకు ఎలా కారణం ఉండాల్సిన పనిలేదో, గొడవలకు కూడా స్పెషల్ కారణాలు ఉండాల్సిన అవసరం లేదు. అలాంటివారిలో ముందు నుంచీ కాంట్రవర్శీల్లో కనిపించే నాయిక నయనతార. ప్రేమ వ్యవహారాల సంగతి పక్కనపెడితే, కోలీవుడ్‌లో నయనతారకు, త్రిషకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే వార్తలు వినిపించేవి. ఇప్పుడు ఇద్దరూ కాస్త సఖ్యతగా కనిపిస్తున్నారు గానీ, ఇంతకు ముందు ఇద్దరినీ ఒకే ఆడిటోరియానికి రప్పించడం కూడా గగనమనే ఫీలింగ్ కనిపించేది నిర్వాహకుల్లో.
త్రిషతో పరిస్థితులు అనుకూలించాక, నయన్ ఇప్పుడు కూలయ్యారు అని అనుకున్నారు జనాలు. కానీ ఉన్నట్టుండి మాళవిక మోహనన్ చెప్పిన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆ మధ్య గుప్పుమంది. `హాస్పిటల్ సీన్‌లో ఈ మధ్య ఓ టాప్ హీరోయిన్ మేకప్‌తో కనిపించారు. అసలు అలాంటిఅవసరం ఏముంది?` అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు మాళవిక. దాని గురించి అప్పట్లో అందరూ చర్చించుకున్నారు. నయనతార నటించిన హాస్పిటల్ సీన్ గురించే మాళవిక అన్నారని క్లారిటీ వచ్చేసింది. అయితే, దీని గురించి అప్పట్లో నయనతార పెద్దగా స్పందించలేదు. రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మాత్రం మాట్లాడారు. సీన్ ఏదైనా డైరక్టర్ చెప్పినట్టే చేస్తానని, హాస్పిటల్‌లో ఉన్నంత మాత్రాన చింపిరి జుట్టుతో కనిపించాల్సిన పనిలేదని కౌంటర్ ఇచ్చారు నయన్.
దాని మీద మాళవిక కూడా వెంటనే రియాక్ట్ కాలేదు. కానీ, ఇప్పుడు ఆమె నటించిన మలయాళ సినిమా క్రిస్ట్ ప్రమోషన్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేస్తూ, లేడీ సూపర్‌స్టార్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అనే ప్రశ్న అడిగారు.`నటీనటుల్ని సూపర్‌స్టార్ అంటే చాలని, లేడీ అని స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదని, నార్త్ లో ఆలియాభట్, కత్రినా కైఫ్, దీపిక పదుకోన్‌లాంటి చాలా మంది సూపర్‌స్టార్‌లు ఉన్నారని, ఇక్కడివారిని కూడా అలా పిలిస్తే చాలని` అన్నారు మాళవిక.సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్‌గా అభిమానుల గుండెల్లో స్పెషల్ ప్లేస్ ఉంది నయనతారకు. ఇప్పుడు మాళవిక ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో మరోసారి ఇద్దరి ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మొదలైనట్టే అంటున్నారు నెటిజన్లు.