English | Telugu
చిక్కుల్లో మంత్రి రోజా భర్త.. నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ!
Updated : Aug 29, 2023
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. ఒక్కోసారి మనం తొందరపాటుతో మాట్లాడే మాటలు మనకి లేనిపోని తిప్పలు తీసుకొస్తాయి. ఏపీ మంత్రి రోజా భర్త, దర్శకుడు సెల్వమణికి అలాంటి పరిస్థితే ఎదురైంది. కొన్నేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆయన మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యేలా చేశాయి.
తమిళనాట దర్శకుడిగా సెల్వమణి మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆయన దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడుగా ఉన్నారు. 2016 లో సెల్వమణి ఒక తమిళ ఛానల్ కి ఇంటర్వ్యూలో ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రా కారణంగా తాను ఎన్నో ఇబ్బందులకు గురయ్యానని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారట. దీంతో ఫైనాన్షియర్ ముకుంద్ ఆయనపై కోర్టులో పరువునష్టం దావా వేశారు. కొంతకాలానికి ముకుంద్ మరణించగా.. ఆయన కుమారుడు గగన్ బోత్రా ఈ కేసుని కొనసాగిస్తున్నారు. ఈ కేసు విచారణకై సోమవారం నాడు సెల్వమణి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణకు హాజరు కాకపోగా, ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన న్యాయస్థానం.. అరెస్టు వారెంట్ జారీ చేసిందని సమాచారం. మొత్తానికి ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కోర్టు కేసుకి కారణమైతే, విచారణను నిర్లక్ష్యం చేయడం ఏకంగా అరెస్ట్ వారెంట్ కి దారితీసింది.