English | Telugu
‘చంద్రముఖి 2’ వాయిదా.. కారణమదే!
Updated : Sep 8, 2023
రాఘవ లారెన్స్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి 2’. 17 ఏళ్ల క్రితం లకలక అంటూ బాక్సాఫీస్ కలెక్షన్స్‌ని కొల్లగొట్టిన ‘చంద్రముఖి’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా మెప్పించనుంది. నాటి చంద్రముఖిలో వేట్టయ రాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించగా.. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అలరించారు. వడివేలు కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ప్రధాన తారాగణం మారారు. వడివేలు తన బసవయ్య పాత్రలోనే అలరించటానికి రెడీ అవుతున్నారు. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది.
అయితే వి.ఎఫ్.ఎక్స్ వర్క్‌లో ఇంకా కాస్త పెండింగ్ ఉండటంతో ‘చంద్రముఖి 2’ను ప్రకటించినట్లు సెప్టెంబర్ 15న విడుదల చేసే అవకాశాలు లేవు. దీనిపై ఇప్పటికే మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. సలార్ ఎలాగూ రావటం లేదు కనుక.. సెప్టెంబర్ 28న ‘చంద్రముఖి 2’ను విడుదల చేయటానికి రెడీ అయిపోయారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ మార్పుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. లైకా ప్రొడక్షన్స్ సినిమాపై ఉన్న క్రేజ్ కంగనా వంటి బాలీవుడ్ స్టార్ యాడ్ కావటంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయటానికి సిద్ధమైంది.
సీనియర్ డైరెక్టర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుభాస్కరన్ నిర్మాత. చంద్రముఖిగా అప్పుడు జ్యోతిక నటించిన తీరుకి అందరూ ఫిదా అయిపోయారు. మరిప్పుడు ఆ పాత్రలో కంగనా రనౌత్ ఎలా నటిస్తారో చూడాలని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో తాను చంద్రముఖిగా నటిస్తానని కంగన అడిగి మరీ నటించినట్లు ఆమె స్వయంగా తెలియజేశారు. ఇక రజినీకాంత్ పాత్రలో కనిపించబోతున్న రాఘవ లారెన్స్ నటనతో ఎలా ఆకట్టుబోతున్నారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.