English | Telugu
'భోళా శంకర్' ట్రైలర్.. మెగాస్టార్ విశ్వరూపం!
Updated : Jul 27, 2023
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భోళా శంకర్'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
'భోళా శంకర్' ట్రైలర్ ఈరోజు(జూలై 27) సాయంత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైంది. చిరంజీవి ఈ ఏడాది ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య' రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాలో మెగాస్టార్ కామెడీ టైమింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దాంతో ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు 'భోళా శంకర్' ట్రైలర్ సైతం అదే శైలిలో సాగింది. చిరు తనదైన కామెడీ టైమింగ్ తో మరోసారి అలరించారు. యాక్షన్ సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అమ్మాయిల కిడ్నాప్ సన్నివేశాలతో ప్రారంభమైన ట్రైలర్.. కామెడీ, యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల మేళవింపుతో పర్ఫెక్ట్ కమర్షియల్ ఫిల్మ్ లా ఉంది. ట్రైలర్ చూస్తుంటే 'వాల్తేరు వీరయ్య' తరహాలో మెగా ఫ్యాన్స్ కి మరోసారి విందుభోజనం ఖాయమనిపిస్తోంది.
తమిళ సినిమా 'వేదాళం'కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. మురళీ శర్మ, రఘు బాబు, వెన్నెల కిషోర్, పి. రవిశంకర్, శ్రీముఖి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.