English | Telugu

బ్యానర్లు, కటౌట్లు కట్టేటప్పుడు జాగ్రత్త!

బ్యానర్లు, కటౌట్లు కట్టేటప్పుడు జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించమని తమ అభిమానులకు సూచించాడు హీరో సాయితేజ్. మేనమామ పవన్ కల్యాణ్‌తో కలిసి అతను నటించిన 'బ్రో' మూవీ శుక్రవారం (జూలై 28) థియేటర్లలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు అభిమానులు అతనికి శుభాకాంక్షలు తెలిపే బ్యానర్లు కడుతూ కరెంట్ షాక్‌తో మృతి చెందిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సాయితేజ్ తమ అభిమానుల్ని హెచ్చరించాడు.

గురువారం అతను సోషల్ మీడియా ద్వారా అభిమానుల్ని ఉద్దేశించి ఒక నోట్ పంచుకున్నాడు. వారి బేషరతు అభిమానం, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన సాయితేజ్, 'బ్రో' లాంటి ప్రతిష్ఠాత్మక సినిమాని గర్వంగా సెలెబ్రేట్ చేసుకుంటున్న సందర్భంలో దాని ప్రమోషన్ విషయాల్లో ఒక విషయం చెప్పదలచుకున్నానని చెప్పాడు. క్రియేటివ్ డిజైన్స్ నుంచి బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసే దాకా గొప్పగా అభిమానం చూపుతున్నారని అతను మెచ్చుకున్నాడు. వారి ఉత్సాహం తమ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లిందనీ, అందుకు రుణపడి ఉంటాననీ అన్నాడు.

అయితే.. బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసే ప్రాసెస్‌లో జాగ్రత్తగా ఉండమనీ, బాధ్యతతో వ్యవహరించమనీ ఫ్యాన్స్‌ను అర్ధించాడు. వారి క్షేమమే తనకు లోకమనీ, అత్యుత్సాహంతో సెలెబ్రేషన్స్ జరుపుకునే సందర్భంలో ఏదైనా హాని జరిగితే అనే ఆలోచనే తనకు భరింపరానిదిగా ఉందనీ సాయితేజ్ ఆ నోట్‌లో చెప్పాడు. వారి ప్రేమ, మద్దతు వెలకట్టలేనివనీ, అయితే వాటికంటే వారి క్షేమమే మరింత ముఖ్యమైనవనీ అతను తెలిపాడు.

తమిళ హిట్ ఫిల్మ్ 'వినోదాయ సిత్తం' ఆధారంగా సముద్రకని డైరెక్ట్ చేసిన 'బ్రో' మూవీలో పవన్ కల్యాణ్, సాయితేజ్, కేతికా శర్మ, ప్రియా వారియర్, రోహిణి, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు నటించగా, తమన్ సంగీతం సమకూర్చాడు. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ త్రివిక్రం రాశారు.