English | Telugu
ఆఖ్రీ సచ్ వెబ్ సిరీస్ రివ్యూ
Updated : Aug 26, 2023
వెబ్ సిరీస్ : ఆఖ్రీ సచ్
నటీనటులు: తమన్నా, అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, కృతి విజ్ తదితరులు
కథ: సౌరవ్ దేవ్, రీతూ శ్రీ
ఎడిటింగ్: రాజేష్ జి పాండే
మ్యూజిక్: అనూజ్ దనైత్ , శివమ్ సేన్ గుప్తా
సినిమాటోగ్రఫీ: వివేక్ షా
నిర్మాతలు: ప్రీతీ సిమోస్, నీతీ సిమోస్
దర్శకత్వం: రాబీ గ్రీవల్
ఓటిటి : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
యథార్థ సంఘటనలను బేస్ చేసుకొని తీసుకునే సినిమాలకి, వెబ్ సిరీస్ లకు ఉండే క్రేజే వేరు. అలాంటి కథతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ' ఆఖ్రీ సచ్'. తమన్నా ముఖ్య పాత్ర పోషించిన ఈ కథ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం...
కథ:
ఢిల్లీలోని కృష్ణానగర్ అనే ఒక ఏరియాలో తెల్లవారుజామున పాలు అమ్మేవాడొచ్చి.. ఒక ఇంటి దగ్గర నిల్చొని ఎంత పిలిచినా లోపలి నుండి ఎవరూ రారు, దాంతో పక్కనే ఉన్న ఆ ఇంట్లో వాళ్ళు బాగా తెలిసిన ఒక అతను చూస్తాడు. లోపలికి వెళ్ళి చూసేసరికి భయపడిపోయి బయటకు వచ్చేస్తాడు. దాంతో లోపల ఏం జరిగిందనే ఆసక్తిని కలిగిస్తూ కథ మొదలవుతుంది. అయితే తర్వాత ఒక పబ్ లో క్రిమినల్ ని ట్రాప్ చేసి పట్టుకునే సీన్ తో స్పెషల్ ఆఫీసర్ అనన్య(తమన్నా) వృత్తిపట్ల ఎంత శ్రద్ధగా ఉంటుందో తెలుస్తుంది. అయితే ఆ కేస్ పరిష్కారించిన వెంటనే అనన్యకి సుపీరియర్ అధికారి కాల్ చేసి ఒక కేస్ అప్పగిస్తాడు. అదే ఢిల్లీలోని ఒక ఇంట్లో ఒకేసారి పదకొండు మంది ఉరేసుకొని చనిపోయిన కేస్.. దీనిని వివరిస్తూ అనన్యని ఆ చోటుకి మీడియా రాకముందే చేరుకోమని సుపీరియర్ అధికారి చెప్పడంతో తను అక్కడి వెళ్తుంది. అలా ఆ కేస్ ని తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాక అనన్యకి ఎదురయిన సమస్యలేంటి? అసలు ఒకే ఇంట్లోని పదకొండు మంది ఒకేసారి చనిపోవడం వెనుక ఉన్న రహస్యమేంటి ? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ 'ఆఖ్రీ సచ్'. పదకొండు మంది ఒకేసారి చనిపోవడం.. దానిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి క్రైమ్ బ్రాంచ్ నుండి స్పెషల్ ఆఫీసర్ రావడంతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. అనన్య(తమన్నా భాటియా) క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినప్పుడు.. ఆ పదకొండు మందిది సూసైడ్ కాదని తెలుస్తుంది. అయితే ఇక్కడే అసలు సమస్య తనకు ఎదురైంది. ఎవరో బలవంతంగా వారందరిని ఉరివేసి చంపారని చెప్పడానికి కూడా సరైన ఆధారాలు కన్పించవు. అలాగని ఆ కుటుంబానికి శత్రువులు కూడా పెద్దగా ఎవరూ లేరు. అప్పుల భాదలతో చనిపోయేంత పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. ఇలాంటి సవాళ్ళతో అనన్య కేస్ ని చాలా క్షుణ్ణంగా విశ్లేషించిన తీరు ఆకట్టుకుంది.
నిజంగా జరిగిన కథ కాబట్టి పాత్రలన్నింటిని క్షుణ్ణంగా చెప్పడానికి డైరెక్టర్ ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ మొత్తంగా రెండు భాగాలుగా ఉంది. అయితే మొదటి భాగంలో కథలోని పాత్రలని వివరించగా, రెండవ భాగంలో ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ఎలా కొనసాగిందో చూపించాడు. అయితే ఒక్కో ఎపిసోడ్ 30 నుండి 40 నిమిషాల వరకు ఉంది. దీంతో కథ కాస్త నెమ్మదిగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది.
అనన్య ఇన్వెస్టిగేషన్ లో కొంత కీలక సమాచారాన్ని సేకరిస్తుంది. ఆ ఇంట్లో జరిగిన హత్యలు కాకుండా ఇంటిపైన వాళ్లు పెంచుకునే పెంపుడు కుక్కని కనిపెడుతుంది. అయితే ఎంతకి వాళ్ళది హత్యా? ఆత్మహత్య అనేది చెప్పడానికి సరైన సమాధానం తెలియలేదు. అయితే ఈ రెండు ఎపిసోడ్ లలో కథని ముగించలేదు డైరెక్టర్. రెండవ సీజన్ ఉంటుందంటూ ముగించాడు. అయితే ఆ హత్యల వెనుక ఉన్న నిజమేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని డైరెక్టర్ క్యూరియాసిటిని పెంచేశాడు.
తమన్నా అందాల ఆరబోత కాస్త ఎక్కువైంది. ఫ్యామిలీతో కలిసి చూడలేం. ఉరేసుకున్న సీన్ ని పదే పదే చూపించడంతో చిన్నపిల్లలని చూడనీయకుండా చూడటమే బెటర్. అయితే యథార్థంగా జరిగిన కథ అయినా కొంచెం కూడా ఎంటర్టైన్మెంట్ లేకుంటే చూడలన్న ఇంట్రెస్ట్ రాదు. ఈ సీన్ బాగుంది అనేట్టుగా ఒకటి రెండు సీన్లు కూడా లేవు. బ్రేకింగ్ న్యూస్: ఏక్ రహస్య అనే ట్యాగ్ లైన్ తో మొదటి భాగం ముప్పై నిమిషాల నిడివితో ఉంటుంది. రెండవది గిల్టీ హార్ట్: ఏక్ సాయా అనే టైటిల్ తో ఉంటుంది. కాస్త ఇంట్రెస్ట్ గా ఉన్నా స్లోగా సాగే సన్నివేశాలు కాస్త చికాకు తెప్పిస్తాయి. అయితే రాబోయే సీజన్ లో అయిన నిడివి ఏం అయినా తగ్గుతుందో చూడాలి.
నటీనటుల పనితీరు:
అనన్యగా తమన్నా భాటియా.. ఒకవైపు అందాలు ఆరబోస్తూ, మరోవైపు సీరియస్ పోలీస్ అధికారిగా అభినయాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా కేస్ ని సాల్వ్ చేసే విధానం ఆకట్టుకుంటుంది. మిగిలిన వాళ్ళు వాళ్ళ పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు.
తెలుగు వన్ పర్ స్పెక్టివ్:
చాలా సెన్సిటివ్ టాపిక్ సూసైడ్. మరి ఇలాంటి కంటెంట్ మీద తీసిన వెబ్ సిరీస్ లను ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్. కానీ మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారిని ఈ కథ మస్త్ ఎంగేజింగ్ చేస్తుంది.
రేటింగ్: 2.5 / 5
✍🏻. దాసరి మల్లేశ్