English | Telugu
చిత్రపురి కాలనీలో రూ.100 కోట్ల స్కాం.. 21 మందిపై నాన్‌బెయిలబుల్ కేసులు!
Updated : Sep 12, 2024
హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీలో అవకతవకలకు పాల్పడ్డ కమిటీ మెంబర్స్‌పై తాజాగా 120బి నాన్‌బెయిలబుల్ సెక్షన్ కింద 15 మందిపై కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. ప్రస్తుత కమిటీ, పాత కమిటీకి సంబంధించి మొత్తం 21 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సినిమా పరిశ్రమలోని వారి కోసం కేటాయించిన ఫ్లాట్లను బయటివారికి అమ్ముకున్నారన్న ఆరోపణలను చిత్రపురి కాలనీ కమిటీ ఎదుర్కొంటోంది. గత ప్రభుత్వం హయాంలో చిత్రపురి కాలనీలో అవకతవకలు జరిగాయని గుర్తించారు. ఈ కాలనీలో ఫ్లాట్స్ పొందేందుకు అర్హులైనవారు, ఐడి కార్డులు వున్న వారిని కూడా పక్కన పెట్టి బయటి వారికి ఫ్లాట్లను అమ్ముకున్నారని గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ ఉన్న ఫ్లాట్లలో 50 శాతం మాత్రమే చిత్ర పరిశ్రమలోని వారికి కేటాయించారు.
దీనికి సంబంధించి గతంలో కస్తూరి శ్రీనివాస్ అనే వ్యక్తి రాయదుర్గం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ని అరెస్ట్ చేశారు. ఇక్కడి స్థలాల విలువ వందల కోట్లకు చేరడంతో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ వారికి ఈ కేసును బదిలీ చేశారు. కాలనీ నిర్మాణం, ఫ్లాట్ల అమ్మకాల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. ఇటీవల హైడ్రా సంస్థ అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే చిత్రపురి కాలనీలోని కొన్ని ఇళ్ళను కూల్చి వేశారు. సినిమా వాళ్ళ దగ్గర నుంచే తాము ఫ్లాట్లను కొనుగోలు చేశామని యజమానులు తెలియజేస్తున్నారు. కమిటీలో ఉన్న వల్లభనేని అనిల్, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, యాంకర్ దీప్తి వాజ్‌పేయి, కాదంబరి కిరణ్, వినోద్‌బాల వంటి వారిపై కేసులు నమోదు చేశారు. సుమారు రూ.100 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఎకనమిక్ అఫెన్స్ వింగ్ వారు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఇఓడబ్ల్యు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ స్కాంపై ఈ సంస్థ విచారణ జరిపి ఒక నివేదిక సమర్పించే అవకాశం ఉంది.