English | Telugu

'నాంది' దర్శకుడితో బెల్లంకొండ.. ఈసారి కథ వేరే ఉంటది!

'అల్లుడు శీను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటిదాకా అతను తొమ్మిది సినిమాల్లో హీరోగా నటించగా అందులో 'రాక్షసుడు' మాత్రమే విజయాన్ని సాధించింది. దాంతో సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ, ఎలాగైనా మంచి విజయాలు అందుకోవాలని చూస్తున్నాడు బెల్లంకొండ. ప్రస్తుతం 'భీమ్లా నాయక్' ఫేమ్ సాగర్ చంద్ర డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే 'రాక్షసుడు-2'లో నటించనున్నాడు. వీటితో పాటు తాజాగా మరో సినిమా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇది 'నాంది' ఫేమ్ విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌ దర్శకత్వంలో రూపొందనుందని సమాచారం.

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన 'నాంది'తో దర్శకుడిగా పరిచయమైన విజ‌య్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత నరేష్ తోనే 'ఉగ్రం' అనే చిత్రం చేశాడు. అది బాక్సాఫీస్ విన్నర్ గా నిలవనప్పటికీ.. దర్శకుడిగా విజయ్ కి మంచి పేరే తీసుకొచ్చింది. మొదటి రెండు సినిమాలకు సీరియస్ సబ్జెక్టులు ఎంచుకున్న కనకమేడల.. మూడో సినిమాకి కమర్షియల్ బాట పడుతున్నట్లు వినికిడి. ఓ మంచి కమర్షియల్ స్క్రిప్ట్ ని చేసి, ఇటీవల బెల్లంకొండకి వినిపించాడట. స్క్రిప్ట్ తో ఇంప్రెస్ అయిన బెల్లంకొండ వెంటనే సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. రాధామోహన్ నిర్మించనున్న ఈ చిత్ర ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నారు.