English | Telugu
చిరంజీవి దర్శకుడితో బాలయ్య సినిమా!
Updated : Oct 25, 2022
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీర సింహా రెడ్డి' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ బాలయ్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మరో చిత్రానికి ఆయన గ్రీన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో బాలయ్య ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయనున్నాడని సమాచారం.
'ఛలో' వంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల రెండో సినిమా 'భీష్మ'తోనూ సూపర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. మూడో సినిమాకే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే మెగాస్టార్ తో వెంకీ మూవీ ప్రకటన వచ్చి చాలా కాలమవుతున్నా ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఇటీవల ఈ ప్రాజెక్ట్ ని చిరంజీవి పక్కన పెట్టాడని కూడా వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు వెంకీ.. చిరంజీవితో కాకుండా మరో సీనియర్ స్టార్ బాలకృష్ణతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది.
'భీష్మ' విడుదలై రెండున్నరేళ్లు దాటిపోయింది. ఇంతవరకు వెంకీ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇంతకాలం చిరంజీవి కోసం ఎదురుచూసి చుక్కెదురు కావడంతో.. తాజాగా ఆయన బాలయ్యని కలిసి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ వినిపించినట్టు తెలుస్తోంది. కథ నచ్చిన బాలయ్య వెంటనే గ్రీన్ ఇచ్చినట్లు టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు.