English | Telugu

'ssmb 28'లో విలన్ గా సంజయ్ దత్!

'కేజీఎఫ్ చాప్టర్-2'లో అధీర పాత్రలో నటించి మెప్పించిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కి సౌత్ లో తెరకెక్కుతున్న భారీ సినిమాలలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఆయన కోలీవుడ్ స్టార్ విజయ్-డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రానున్న 'దళపతి 67'తో పాటు, రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కనున్న ఫిల్మ్ లో నటించనున్నట్లు తెలుస్తుండగా.. తాజాగా ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కించుకున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'అతడు', 'ఖలేజా' వంటి చిత్రాల తర్వాత వీరి కలయికలో వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై, యాక్షన్ సన్నివేశాలతో ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం సంజయ్ దత్ ని రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాలలో విలన్ పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. 'ssmb 28'లోనూ విలన్ పాత్ర విభిన్నంగా ఉంటుందని, దానికి సంజయ్ దత్ సరిగ్గా సరిపోతారని సంప్రదించగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

హారిక & హారిక క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.