English | Telugu
సూర్య సెకండ్ తెలుగు మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
Updated : Feb 17, 2025
గతేడాది 'కంగువా'తో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటాలనుకున్న కోలీవుడ్ స్టార్ సూర్య(Suriya)కు నిరాశే ఎదురైంది. బాక్సాఫీస్ దగ్గర సూర్య ఒక సాలిడ్ సక్సెస్ చూసి చాలా కాలమైంది. అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై స్పెషల్ కేర్ తీసుకుంటూ, అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'రెట్రో'తో పాటు, ఆర్.జె. బాలాజీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. వీటి తర్వాత సూర్య.. ఒక తెలుగు ఫిల్మ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఒక సినిమా కమిట్ అయినట్లు సమాచారం. 'తొలిప్రేమ'తో దర్శకుడిగా పరిచయమైన వెంకీ.. మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' సినిమాలతో నిరాశపరిచిన ఆయన.. ప్రేమ కథలను పక్కనపెట్టి ట్రాక్ మార్చాడు. వెంకీ దర్శకత్వంలో వచ్చిన గత రెండు చిత్రాలు 'సార్', 'లక్కీ భాస్కర్' మెప్పించాయి. ఇటీవల ధనుష్ తో వెంకీ తన నెక్స్ట్ మూవీ చేసే అవకాశముందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు సూర్య పేరు తెరపైకి వచ్చింది. 'రంగ్ దే' నుంచి వెంకీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలను నిర్మిస్తూ వస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఈ ప్రాజెక్ట్ కూడా రూపొందనుందట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని, మేలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని వినికిడి.
2010లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన 'రక్త చరిత్ర-2'లో సూర్య నటించాడు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది. ఏకంగా 15 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మరో తెలుగు సినిమా చేయడానికి సూర్య సిద్ధమవుతున్నాడు. వెంకీ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ.. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనుందట.