English | Telugu

త్రివిక్రమ్ దర్శకత్వంలో అకీరా డెబ్యూ మూవీ.. పక్కా ప్లాన్ తో పవన్ కళ్యాణ్!

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ రంగ ప్రవేశం కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కేవలం తన కటౌట్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు అకీరా. అతని ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించడం ఖాయమనే నమ్మకంతో.. అకీరా ఎంట్రీ కోసం మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఫలించేలా.. అకీరా ఎంట్రీ ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది. (Pawan kalyan)

 

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ 'ఓజీ'లో.. అకీరా కాసేపు కనిపిస్తాడని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇక అకీరా హీరోగా నటించే మొదటి సినిమా సైతం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అకీరా డెబ్యూ బాధ్యతను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పవన్ అప్పగించినట్లు సమాచారం. (Akira Nandan)

 

పవన్, త్రివిక్రమ్ ఎంత మంచి స్నేహితులో తెలిసిందే. పవన్ నటించిన పలు సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా, దర్శకుడిగా వ్యవహరించారు. వాటిలో 'అత్తారింటికి దారేది' వంటి ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ కూడా ఉంది. పవన్ తనయుడిగా అకీరా ఎలాగూ మెగా ఫ్యాన్స్ కి, మాస్ ప్రేక్షకులకు చేరువవుతాడు. అయితే మొదటి సినిమాతోనే యువతకు, ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా చేరువై.. ఒక సేఫ్ డెబ్యూ కావాలంటే.. త్రివిక్రమ్ కరెక్ట్ అని పవన్ భావించారట. అందుకే అకీరా డెబ్యూ ఫిల్మ్ బాధ్యతను త్రివిక్రమ్ కి అప్పగించినట్లు తెలుస్తోంది.

 

త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత త్రివిక్రమ్ తన పూర్తి ఫోకస్ ని అకీరా డెబ్యూ ఫిల్మ్ పై పెట్టనున్నారని సమాచారం.

 

ఇక అకీరా డెబ్యూ మూవీని తమ బ్యానర్ లో చేయండి అంటూ ఇప్పటికే పలువురు అగ్ర నిర్మాతలు పవన్ ని కోరుతున్నారట. అయితే త్రివిక్రమ్ దర్శకుడైతే మాత్రం.. ఆ సినిమా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే జరిగితే మిగతా ప్రొడ్యూసర్స్.. అకీరా రెండో సినిమా కోసం ప్రయత్నాలు మొదలు పెట్టే అవకాశముంది.

 

ఏది ఏమైనా, త్రివిక్రమ్ చేత డెబ్యూ మూవీ చేయించాలనే పవన్ ఆలోచన మంచిదే. ఎందుకంటే హీరో లుక్స్, డైలాగ్స్, సాంగ్స్ ఇలా ప్రతి విషయంలో స్పెషల్ తీసుకుంటూ ఉంటారు త్రివిక్రమ్. దాంతో మొదటి సినిమాతోనే అకీరా ఎందరికో చేరువయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.