English | Telugu
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వెంకీ మామ.. జానర్ ఏంటో తెలుసా?
Updated : Mar 6, 2025
టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి (Surender Reddy)కి మంచి పేరుంది. 'అతనొక్కడే', 'కిక్', 'రేసుగుర్రం', 'ధృవ' వంటి హిట్ సినిమాలు ఆయన డైరెక్షన్ లో వచ్చాయి. అయితే ఈమధ్య ఆయన ట్రాక్ రికార్డు గొప్పగా లేదు. 'సైరా నరసింహారెడ్డి' పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ, భారీ బిజినెస్ కారణంగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక గత చిత్రం 'ఏజెంట్' అయితే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో రెండేళ్లవుతున్నా సురేందర్ రెడ్డి కొత్త సినిమా మొదలు కాలేదు. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ, అది పట్టాలెక్కలేదు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు సురేందర్ రెడ్డికి వెంకటేష్ తో ఓ సినిమా చేసే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. (Venkatesh)
ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం'తో రీజినల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు వెంకటేష్. దీంతో వెంకీ మామ చేయబోయే తదుపరి సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత వెంకటేష్ చేయబోయే చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే అని తెలుస్తోంది. ఇది వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుందని సమాచారం. తన కెరీర్ లో ఎక్కువగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో అలరించిన సురేందర్ రెడ్డి.. మొదటిసారి వెంకటేష్ కోసం ఫ్యామిలీ బాట పడుతున్నట్లు వినికిడి. నల్లమలపు బుజ్జి నిర్మాత గా వ్యవహరించనున్న ఈ ప్రాజెక్ట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది అంటున్నారు.
